టెర్రరిస్టులను ఉంచే సెల్‌‌‌‌లో16 రోజులు బంధించారు: సీఎం రేవంత్

టెర్రరిస్టులను ఉంచే  సెల్‌‌‌‌లో16 రోజులు బంధించారు:  సీఎం రేవంత్

 

  •  టెర్రరిస్టులను ఉంచే డిటెన్షన్ సెల్‌‌‌‌లో16 రోజులు బంధించిన్రు: సీఎం
  • రాత్రి పూట బల్లుల బాధకు నిద్రపోకుండా పొద్దున చెట్ల కింద పడుకున్న
  • నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిన్రు.. జైలు నుంచి పోయి లగ్న పత్రిక రాసుకున్నం
  • కూలీకి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా
  • మీలాగా నేను కక్ష గడ్తే మీ కుటుంబమంతా జైలులో ఉంటుండే
  • అసెంబ్లీలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు రేవంత్ కౌంటర్

హైదరాబాద్, వెలుగు:  కేటీఆర్​ ఫాంహౌస్​పై డ్రోన్ ఎగరేశానని తనపై తప్పుడు కేసు పెట్టి 16 రోజుల పాటు చర్లపల్లి జైలులో నక్సలైట్లు, టెర్రరిస్టులను ఉంచే డిటెన్షన్ సెల్‌‌‌‌లో నిర్బంధించారని  సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘నాడు నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిన్రు.. జైలు నుంచి పోయి లగ్న పత్రిక రాసుకునే పరిస్థితి కల్పించిన్రు. ఇప్పుడేమో కూలీకి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నింటినీ భరిస్తున్నా. నేను మీలాగా కక్ష కడ్తే మీ కుటుంబమంతా ఇప్పటికే చర్లపల్లి జైలులోని డిటెన్షన్​ సెల్‌‌‌‌లో ఉంటుండే..’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌నుద్దేశించి సీఎం రేవంత్​ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గురువారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల తెలంగాణ ఆగమవుతున్నదని, సంక్షేమ రాష్ట్రం సంక్షోభం వైపు వెళ్తున్నదని  విమర్శించారు. దీనిపై సీఎం గట్టి కౌంటర్​ ఇచ్చారు. కక్ష రాజకీయాలకు పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప, 15 నెలల్లో తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు.

 ‘‘ఎవరైనా అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేస్తే రూ.500 ఫైన్​వేసి వదిలేస్తరు. కానీ ఒక జర్నలిస్టు జన్వాడలోని కేటీఆర్ ఫాంహౌస్​మీద డ్రోన్​ఎగరేస్తే, ఆ ఫొటోలు బయటపెట్టాననే కారణంతో నాడు పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న నాపై అప్పటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రూ.500 ఫైన్, స్టేషన్​బెయిల్‌‌‌‌‌‌‌‌తో పోయే కేసును పెద్దది చేశారు. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అన్ని రకాల వ్యవస్థలను ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్‌‌‌‌‌‌‌‌లో నన్ను 16 రోజలు ఉంచారు. ఇటు 7 ఫీట్లు, అటు12 ఫీట్లు ఉండే ఆ సెల్‌‌‌‌‌‌‌‌లో 3.5 ఫీట్లు ఉన్న దిమ్మె, ఒక చిన్న బాత్రూం ఉండేది. ఆ బాత్రూంలో కూర్చుంటే బయట వ్యక్తులకు కనిపిస్తది. 

రాత్రిపూట పడుకోకుండా ట్యూబ్ లైట్ ఆన్‌‌‌‌‌‌‌‌లో పెట్టేవారు. ఇంతింత బల్లులు పురుగులను తినేందుకు అటు ఇటు పరుగెత్తేవి. లైట్ బంద్​చేయమని బయట కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ను అడిగితే బంద్​చేయవద్దని పైనుంచి ఆదేశాలు ఉన్నాయన్నడు. బల్లులు మీద పడ్తాయని 16 రోజుల్లో ఏ ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు. పొద్దున పూట వదిలినప్పుడు ఆరు గంటలకు బయటకు వచ్చి చెట్టు కింద పడుకున్నా’’ అంటూ తాను జైలులో ఉన్నప్పటి పరిస్థితులను సీఎం రేవంత్​ గుర్తుచేసుకున్నారు. చేయని తప్పుకు బీఆర్ఎస్ వాళ్లు16 రోజుల పాటు తనను డిటెన్షన్ సెల్‌‌‌‌‌‌‌‌లో నిర్బంధించినా.. ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. పైన దేవుడనేవాడు చూస్తాడని, అంతకు నాలుగు ఇంతలు అనుభవిస్తారని తాను అనుకునేవాడినని.. సరిగ్గా తాను ప్రమాణ స్వీకారం చేసే రోజే తనపై కక్ష సాధించినవాళ్లను దవాఖానలో చేరేలా దేవుడే చేశాడన్నారు.   

కూలీలను పెట్టి బూతులు తిట్టించినా ఊరుకున్నా..  

కూలీ మనుషులను పెట్టి, బూతులు తిట్టిస్తున్నా సంయమనంతో ఊరుకున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘బీఆర్ఎస్​వాళ్లు తమ సొంత పార్టీ ఆఫీసులో కూలీకి మనుషులను తెప్పించి, వాళ్లతో పచ్చి బూతులు మాట్లాడించి, ఆ తిట్లను రికార్డు చేయించి సోషల్​మీడియాలో పెట్టారు. వారి చెంపలు పగలగొట్టేంత శక్తి ఉన్నప్పటికీ సంయమనంతో ఊరుకున్నాను. బయట ఎవరైనా మాట్లాడకూడనివి మాట్లాడితే వాటిని సైతం బీప్​సౌండ్‌‌‌‌‌‌‌‌తో సెన్సార్ చేస్తాం. టెలికాస్ట్ చేయకుండా చూస్తాం. ఆ మాత్రం విచక్షణ లేకుండా బీఆర్ఎస్​వాళ్లు కిరాయి మనుషులతో నన్ను తిట్టించినా.. నేను కక్ష సాధింపులకు పాల్పడలేదు. నిజానికి ముఖ్యమంత్రిగా నాకున్న విశేషాధికారాలతో మీపై కక్ష సాధింపులకు పాల్పడితే మీలో ఎవరూ బయట తిరిగేవారు కాదు” అని అన్నారు. ‘బీఆర్ఎస్​వాళ్లను లోపలేస్తారనే నీకు సీఎం పదవి ఇచ్చారు కదా? మరి ఎందుకు సంయమనం పాటిస్తున్నారు.. వారిని ఎప్పుడు లోపలేస్తారు?’ అని అందరూ అడుగుతున్నా తాను అటువైపు ఆలోచించలేదని చెప్పారు. ‘‘ప్రజలు అధికారం ఇచ్చింది  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన  కోసం, ప్రజల సంక్షేమం కోసం.. ఈ వయసులో ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పజెప్పారు. అందుకే నా విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా ఎవరిపై కక్ష సాధింపులకు పాల్పడలేదు. అక్రమ కేసులు పెట్టలేదు. తెలంగాణ సమాజం అన్నింటినీ గమనిస్తున్నది’’ అని అన్నారు.

నా బిడ్డ లగ్గానికీ పోనియ్యలే.. 

జైల్లో ఉంటే తన బిడ్డ లగ్గానికి కూడా పోనియ్యలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘నా బిడ్డ లగ్గం ఉంటే మధ్యంతర బెయిల్‌‌‌‌‌‌‌‌పై రెండు గంటలు పోయి రావడానికి కూడా అభ్యంతరం పెట్టారు. లగ్న పత్రిక రాసుకోవడానికి కూడా ఒప్పుకోలే. ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి, కండిషన్​బెయిల్‌‌‌‌‌‌‌‌పై చర్లపల్లి జైలు నుంచి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్​కు పోయి నా బిడ్డ లగ్న పత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా చర్లపల్లి జైలుకి పోయిన. ఇది రాజకీయ కక్ష సాధింపు కదా?’’ అని ప్రశ్నించారు. తనపై అక్రమ కేసులు పెట్టినా,  చర్లపల్లి జైలులో నక్సలైట్లు, టెర్రరిస్టులు ఉండే డిటెన్షన్ సెల్‌‌‌‌‌‌‌‌లో ఉంచినా, 16 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపినా.. తాను ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. ‘‘నేను నిజంగా కక్ష సాధించాలని అనుకుంటే.. మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండేవారు కాదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు అందరికీ చర్లపల్లి జైలులో  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించేవాడిని’’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి సీఎం అన్నారు.