2,500 ఎకరాల .. రక్షణ భూములివ్వండి

2,500 ఎకరాల .. రక్షణ భూములివ్వండి
  • వరంగల్​ సైనిక్​ స్కూల్​ అనుమతులు పునరుద్ధరించాలి
  • రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి
  • రెండురోజుల పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్న సీఎం
  • కాంగ్రెస్​ ఎంపీలతో కలిసి రాజ్​నాథ్​తో సమావేశం
  • రక్షణ భూముల బదలాయింపుపై చర్చలు
  • కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్టణ శాఖ మంత్రి ఖ‌ట్టర్​తోనూ భేటీ
  • రాష్ట్రానికి 2.70 ల‌క్షల ఇండ్లు మంజూరు చేయాలని రిక్వెస్ట్​
  • స్మార్ట్​ సిటీ మిషన్​ కాలపరిమితి ఏడాది పొడిగించాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు : హైద‌రాబాద్‌లో రోడ్ల విస్తర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు దాదాపు 2,500 ఎక‌రాల‌ డిఫెన్స్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్​ను సీఎం రేవంత్​రెడ్డి కోరారు. వరంగల్​లో సైనిక్ స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీలతో కలిసి అక్బర్ రోడ్ లోని రక్షణ శాఖ మంత్రి నివాసానికి చేరుకొని.. రాజ్​నాథ్​తో భేటీ అయ్యారు.

రావిరాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2,462 ఎక‌‌‌‌‌‌‌‌రాల భూముల‌‌‌‌‌‌‌‌ను ఇమార‌‌‌‌‌‌‌‌త్ ప‌‌‌‌‌‌‌‌రిశోధ‌‌‌‌‌‌‌‌న కేంద్రం (ఆర్‌‌‌‌‌‌‌‌సీఐ) ఉప‌‌‌‌‌‌‌‌యోగించుకుంటున్న విష‌‌‌‌‌‌‌‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ భూములు ఆర్‌‌‌‌‌‌‌‌సీఐ వినియోగించుకుంటున్నందున హైదరాబాద్ పరిధిలోని దాదాపు 2,500 ఎక‌‌‌‌‌‌‌‌రాల డిఫెన్స్ భూములను త‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌కు అప్పగించాల‌‌‌‌‌‌‌‌ని కోరారు. హైద‌‌‌‌‌‌‌‌రాబాద్​ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రం చుట్టు ప‌‌‌‌‌‌‌‌క్కల ప్రాంతాల్లో డెవలప్​మెంట్ లో భాగంగా చేపట్టనున్న ర‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌దారుల విస్తర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌, ఫ్లైఓవ‌‌‌‌‌‌‌‌ర్లు, ఇత‌‌‌‌‌‌‌‌ర మౌలిక స‌‌‌‌‌‌‌‌దుపాయాల క‌‌‌‌‌‌‌‌ల్పన‌‌‌‌‌‌‌‌పై రక్షణ శాఖ బదలాయించే భూములు దోహదపడతాయని రక్షణ మంత్రికి సీఎం చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే భూముల బదలాయింపు ప్రపోజల్ కు అంగీకారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రానికి గ‌‌‌‌‌‌‌‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌‌‌‌‌‌‌‌త బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్మాణప‌‌‌‌‌‌‌‌రంగా ఎటువంటి చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోలేదని రక్షణ మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.  వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌‌‌‌‌‌‌‌తుల గ‌‌‌‌‌‌‌‌డువు ముగిసినందున ఆ అనుమ‌‌‌‌‌‌‌‌తులు పున‌‌‌‌‌‌‌‌రుద్ధరించాల‌‌‌‌‌‌‌‌ని, లేదా కొత్తగా మంజూరు చేయాల‌‌‌‌‌‌‌‌ని సీఎం అన్నారు. 

2.70 ల‌‌‌‌‌‌‌‌క్షల ఇండ్లు కేటాయించండి

2024–25 ఫైనాన్షియల్ ఈయర్ కు గాను బీఎల్‌‌‌‌‌‌‌‌సీ మోడ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ‌‌‌‌‌‌‌‌కు 2.70 ల‌‌‌‌‌‌‌‌క్షల ఇండ్లు మంజూ రు చేయాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర గృహ‌‌‌‌‌‌‌‌నిర్మాణ‌‌‌‌‌‌‌‌, ప‌‌‌‌‌‌‌‌ట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మ‌‌‌‌‌‌‌‌నోహ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లాల్ ఖ‌‌‌‌‌‌‌‌ట్టర్​ను సీఎం రేవంత్​రెడ్డి కోరారు. నిరుపేద‌‌‌‌‌‌‌‌లకు వారి సొంత స్థలాల్లో 25 ల‌‌‌‌‌‌‌‌క్షల ఇండ్లు నిర్మించాల‌‌‌‌‌‌‌‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రికి వివరించారు. రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అనంతరం ఖ‌‌‌‌‌‌‌‌ట్టర్​తో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ల్చిన 25 ల‌‌‌‌‌‌‌‌క్షల ఇండ్లలో 15 ల‌‌‌‌‌‌‌‌క్షలు ఇండ్లు ప‌‌‌‌‌‌‌‌ట్టణాభివృద్ధి సంస్థల ప‌‌‌‌‌‌‌‌రిధిలోకి వ‌‌‌‌‌‌‌‌స్తాయ‌‌‌‌‌‌‌‌ని

వాటిని ల‌‌‌‌‌‌‌‌బ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగ‌‌‌‌‌‌‌‌త ఇండ్ల నిర్మాణం (బీఎల్‌‌‌‌‌‌‌‌సీ) ప‌‌‌‌‌‌‌‌ద్ధతిలో నిర్మించ‌‌‌‌‌‌‌‌నున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ప్రధాన‌‌‌‌‌‌‌‌మంత్రి ఆవాస యోజ‌‌‌‌‌‌‌‌న(ప‌‌‌‌‌‌‌‌ట్టణ‌‌‌‌‌‌‌‌) –-పీఎంఏవై (యూ)ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున‌‌‌‌‌‌‌‌, 2024–25 ఏడాదికి పీఎంఏవై (యూ) కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాల‌‌‌‌‌‌‌‌ని, రాష్ట్రంలో తాము నిర్మించే ఇండ్లను పీఎంఏవై (యూ) గైడ్ లైన్స్ ప్రకారం నిర్మిస్తామ‌‌‌‌‌‌‌‌ని తెలియజేశారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటి వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ‌‌‌‌‌‌‌‌కు 1,59,372 ఇండ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రక‌‌‌‌‌‌‌‌టించార‌‌‌‌‌‌‌‌ని గుర్తుచేశారు. అయితే ఇందులో ఇప్పటి వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు  రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుద‌‌‌‌‌‌‌‌ల చేశార‌‌‌‌‌‌‌‌ని, మిగ‌‌‌‌‌‌‌‌తా నిధులు విడుద‌‌‌‌‌‌‌‌ల చేయాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. 

స్మార్ట్​ సిటీ మిషన్​ కాలపరిమితి ఏడాది పెంచాలి

స్మార్ట్ సిటీ మిష‌‌‌‌‌‌‌‌న్ కింద చేప‌‌‌‌‌‌‌‌ట్టే ప‌‌‌‌‌‌‌‌నులు పూర్తి కానందున... ఈ మిష‌‌‌‌‌‌‌‌న్ కాల ప‌‌‌‌‌‌‌‌రిమితిని 2025 జూన్ వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు పొడిగించాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రి ఖట్టర్​కు సీఎం రేవంత్​ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిష‌‌‌‌‌‌‌‌న్ కింద తెలంగాణ‌‌‌‌‌‌‌‌లో వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌, క‌‌‌‌‌‌‌‌రీంన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రాల్లో ప‌‌‌‌‌‌‌‌నులు చేప‌‌‌‌‌‌‌‌ట్టిన‌‌‌‌‌‌‌‌ట్లు తెలిపారు. మిష‌‌‌‌‌‌‌‌న్ కింద వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌లో 45 ప‌‌‌‌‌‌‌‌నులు పూర్తయ్యాయ‌‌‌‌‌‌‌‌ని, రూ.518 కోట్ల వ్యయంతో చేప‌‌‌‌‌‌‌‌ట్టిన మ‌‌‌‌‌‌‌‌రో 66 ప‌‌‌‌‌‌‌‌నులు కొన‌‌‌‌‌‌‌‌సాగుతున్నాయ‌‌‌‌‌‌‌‌ని వివరించారు. క‌‌‌‌‌‌‌‌రీంన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లో 25 ప‌‌‌‌‌‌‌‌నులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేప‌‌‌‌‌‌‌‌ట్టిన 22 ప‌‌‌‌‌‌‌‌నులు ప్రాసెస్ లో ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీ మిష‌‌‌‌‌‌‌‌న్ కాల ప‌‌‌‌‌‌‌‌రిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తున్నదని, అయితే.. ప‌‌‌‌‌‌‌‌నులు ముగిసే వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు మిష‌‌‌‌‌‌‌‌న్ కాల‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌రిమితిని మ‌‌‌‌‌‌‌‌రో ఏడాది పొడిగించాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​కు సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్​రెడ్డితో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రేవంత్.. నేరుగా తుగ్లక్​రోడ్​లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. తర్వాత తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తర్వాత ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో విడివిడిగా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

తర్వాత ఇటీవల పార్టీలో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి తుగ్లక్ రోడ్​లోని నివాసంలో సమావేశం అయ్యారు. వీరితో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ధనసరి సీతక్క కూడా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు హర్కర గోపాల్, ఎమ్మెల్యే మల్‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, పార్టీ నేతలు మన్నె జీవన్ రెడ్డి, బండి సుధాకర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ తదితరులు సీఎంను ఆయన నివాసంలో కలిశారు.