హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్న వార్తలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతం వైపు హైడ్రా కనీసం కన్నెత్తి చూడలేదని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఒక్క ఇటుక పెళ్ల కూడా కూలగొట్టలేదని.. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడంతో బాధితులే వారి ఇండ్లను కూలగొట్టారని వివరణ ఇచ్చారు. ఇక, దామ గుండంలో నిర్మించునున్న నేవీ రేడార్ స్టేషన్‌కు మేం అనుమతి ఇవ్వలేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చిందని క్లారిటీ ఇచ్చారు. దేశ భద్రతను బీఆర్ఎస్ నేతలు రాజకీయాలకు ముడిపెడుతున్నారని.. దేశ భద్రతను వ్యతిరేకిస్తే చేస్తే వాళ్లు టెర్రరిస్ట్ కసబ్ కంటే చరిత్రహీనులని ఘాటు విమర్శలు చేశారు.
ALSO READ | మూసీపై అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం రండి..: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ ఓపెన్ ఆఫర్
దామగుండంలో ఏర్పాటు చేసేది వెరీలో ఫ్రెక్వెన్సీ రాడార్స్ సిస్టమ్ అని.. దాని రేడిషియేషన్ ఏమి అంతా ప్రమాదకరంగా ఉండదన్నారు. ఇలాంటిదే తెలంగాణ పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా మన దేశం నుంచే ఎగుమతి చేస్తున్నామన్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారణం.. కంప్యూటర్‌తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ విజన్‌తోనే దేశం ముందడుగు వేసిందని.. అప్పటి ప్రధాని పీవీ సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచిందని కొనియాడారు.