
మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన అత్తగారి ఊరి కోసం అమన్ గల్ కు రోడ్డు వేయలేదన్నారు రేవంత్. కావాలంటే సొంత పైసలతో రోడ్డు వేసుకునే స్తోమత తన అత్తగారికి ఉందన్నారు రేవంత్ .
‘హరీశ్‌రావు అంటున్నడు.. అమన్ గల్ మా అత్తగారు ఊరనీ. మా అత్తవాళ్లు ఆ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలు అయితున్నది. పరిశ్రమల కాలుష్యంతో రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా గత పాలకులు ఫార్మా కంపెనీలను అక్కడ పెట్టాలని చూసిన్రు. కానీ, మేం ఫ్యూచర్ సిటీ తెచ్చి ఏఐ హబ్, ఎడ్యుకేషన్ హబ్ చేయాలని పెడుతుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. రోడ్డు అమన్‌గల్ కోసం, అత్తగారి ఊరుకోసం వేయలేదు. వాళ్లకు రోడ్డు కావాలంటే సొంత పైసలతో అంతకంటే పెద్ద రోడ్డు వేసుకునే శ్రీమంతులు వాళ్లు.. ఏం పేదోళ్లు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్లు బాగుపడే పరిస్థితులు ఏం లేవు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్లు 11 డెవలప్ చేయాలని ప్లాన్ తెచ్చినం” అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
‘‘రాష్ట్రాభివృద్ధి వద్దా ? ఆర్ఆర్ఆర్ వద్దా ? ఫ్యూచర్ సిటీ కట్టాలా వద్దా? మూసీ పునరుజ్జీవం చేయలా వద్దా? పదేండ్లు ఏదైనా ఎక్కడా భూమిని సేకరించకుండానే చేశారా ?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు మమ్మల్ని సాయం చేయాలని అంటున్నరు. ఆ భూములు ఎవరు సేకరించారు ? కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్‌హౌస్‌లకు డైరెక్ట్ గా కాల్వలు తీసుకున్నది ఎవరు ? రంగనాయకసాగర్, కొండపోచ్చమ్మ, మల్లన్న సాగర్ ఎవరు భూములు కొనుక్కున్నరు?.. ఎవరు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నరు? ఆ రిజర్వాయర్ల నుంచి ఎవరికి నీళ్లు పోతున్నాయి.. రోడ్లు ఎవరు వేసుకున్నారు ? ఈ రోజు నాకు కానీ, నా కుటుంబ సభ్యులం కానీ ఒక ఇంచ్ భూమి కానీ మేం కొనుక్కున్నమా? అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సీటి అని అంటున్నరు. 4 కోట్ల తెలంగాణ సోదరి సోదరీమణుల సిటీ అదీ. అభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు
ALSO READ | కునాల్ కమ్రాకు అండగా ఫ్యాన్స్.. లక్షల్లో విరాళాలు..
గతంలో మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తం. ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్‌లో చేస్తామంటే.. కామారెడ్డిలో రాకెట్ సైన్స్ వాళ్లకు భూమి ఇచ్చినం. అక్కడ ఉన్నది ప్రతిపక్ష ఎమ్మెల్యే. కానీ, మేం రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఆలోచిస్తం. తెలంగాణ మొత్తం మాదే. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న. ఒక ప్రాంతానికి కాదు. తెలంగాణ మొత్తం మా మంత్రివర్గం, మా ప్రభుత్వం పరిధి. లేక్స్, రాక్స్‌పై నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని.. ఎమ్మెల్యేలందరం ఒక ట్రిప్ తీసుకెళ్లి చూపిద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దాం” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.