16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా.. నేను తల్చుకుంటే మీ ఫ్యామిలీలో ఒక్కరూ బయట ఉండరు: CM రేవంత్

16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా.. నేను తల్చుకుంటే మీ ఫ్యామిలీలో ఒక్కరూ బయట ఉండరు: CM రేవంత్

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డ్రోన్ ఎగరేశానని ఆనాడు నన్ను జైల్లో పెట్టారు.. రూ.500 ఫైన్ వేసే తప్పుకు నన్ను చర్లపల్లి జైలుకు పంపారు.. 16 రోజుల పాటు నక్సలైట్లు, జీవిత ఖైదీలు, ఐఎస్ఎస్ ఉగ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్‎లో నన్ను నిర్బంధించారు. నా బిడ్డ పెళ్లికి దూరం చేశారు. మేం కూడా వాళ్లలాగే కక్షసాధింపు చర్యలకు దిగితే ఇవాళ వాళ్లంతా చర్లపల్లి, చంచల్ గూడ జైల్లో ఉండేవారు. ఇప్పుడు చెప్పండి రాజకీయ కక్ష సాధింపు మీదా నాదా..? అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం (మార్చి 27) ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేం కూడా బీఆర్ఎస్ మాదిరిగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి ఉంటే కేటీఆర్ పరిస్థితి ఏమిటీ.. ? మేం రివేంజ్ పాలిటిక్స్ చేసి ఉంటే కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని అన్నారు. సలహాలు, సూచనలు కొందరు ఇవ్వడానికే అన్నట్లు భావిస్తున్నారు.. వాళ్లు పాటించడానికి కాదు అనుకుంటున్నారని విమర్శించారు. డ్రోన్ ఎగరేశాననే చిన్న కేసులో నన్ను జైల్లో పెట్టి నా బిడ్డ లగ్గం చూడకుండా చేశారు. 

చర్లపల్లి జైలు నుంచి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‎కి వెళ్లి లగ్గంపత్రికను రాసుకున్నాం. జైల్లో నన్ను నిద్రపోనివ్వకుండా చేశారు. బల్లులు ఉన్న గదిలో నన్ను వేశారు. నన్ను ఉంచిన సెల్ లో ట్యూబ్ లైట్లు కూడా బంద్ చేయకపోయేది. లైట్లు ఆఫ్ చేయాలని అడిగితే చెయొద్దని పై నుంచి ఆదేశం ఉందని చెప్పేవారు. రాత్రి నిద్రలేక ఉదయం చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. నేను కూడా బీఆర్ఎస్ లాగా కక్ష సాధింపు చర్యలు చేస్తే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరని హాట్ కామెంట్స్ చేశారు. కూలీ డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని, నన్ను, నా కుటుంబాన్ని పచ్చిబూతులు తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

Also Read :- తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు..? కేంద్రంతో కొట్లాడాల్సిందే