- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి
నారాయణపేట/కోస్గి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీముల అమలు నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు స్కీములను ప్రారంభించిన అనంతరం సభలో సీఎస్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షల వరకు పెంచామన్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్‌కార్డులకు సన్న బియ్యం ఇస్తామని తెలిపారు.
తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి తెలంగాణకు దేశంలోనే అత్యధిక పెట్టుబడులను తీసుకొచ్చారని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో నాలుగు పథకాలకు చంద్రవంచ నుంచి ప్రారంభించుకోవడం గర్వంగా ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
ఇంటి కల నెరవేరింది..
మాకు సొంత ఇల్లు లేదు. కట్టుకోవడానికి జాగా లేదు, ఆర్థిక స్తోమత కూడా లేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే సొంత ఇల్లు లేని నా కుటుంబానికి ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేసింది. చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సొంతింటి కల వస్తది.
- తెలుగు మంగమ్మ, చంద్రవంచ
సాయం పెరిగింది.. కష్టం తీరింది
పెట్టుబడి సాయం పెరిగింది. మా కష్టం తీరింది. పెరిగిన ధరలతో వ్యవసాయం చేయాలంటే ఆర్థికంగా నష్టపోతున్నాం. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12 వేలు అందించడం సంతోషంగా ఉంది.
- భాగ్యమ్మ, చంద్రవంచ
స్కీములకు దూరమైనం..
పదేండ్లుగా రేషన్ కార్డులు ఇయ్యలేదు. అప్లికేషన్లు పెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ స్కీములకు దూరమైనం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది.
- పల్లెగిరి లక్ష్మి, చంద్రవంచ