బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్!
  • ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
  • ఈ నెల 31తో ముగియనున్న గడువు
  • చైర్మన్ రేసులో గోపిశెట్టి నిరంజన్
  • ముగ్గురు సభ్యులను నియమించే అవకాశం

బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నెల 31తో ప్రస్తుత బీసీ కమిషన్ గడువు ముగియనున్నది. కమిషన్ ఏర్పాటుపై నేడో.. రేపో ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాల సమాచారం. కాగా, బీసీ కమిషన్ చైర్మన్ పదవికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. చైర్మన్ తో పాటు మరో ముగ్గురు సభ్యుల నియామకానికి అవకాశం ఉంది. 

నాలుగు పదవులను నాలుగు సామాజిక వర్గాల నేతలకు సీఎం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. కాగా, రాష్ట్రంలో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోన్న నేపథ్యంలో బీసీ కమిషన్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. కమిషన్ ద్వారానే కులగణన చేపట్టాలని సుప్రీం జడ్జిమెంట్ నేపథ్యంలో

 ప్రభుత్వం కూడా కమిషన్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రస్తుత చైర్మన్ ను వకులభరణం కృష్ణమోహన్ రావును మరో 6 నెలల పాటు పొడిగించి, కొత్తగా ముగ్గురు మెంబర్లను నియమించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. దీనిపై త్వరలో స్పష్టత రానున్నది.