కొత్త ఎంపీలతో సందడిగా సీఎం ఇల్లు

కొత్త ఎంపీలతో సందడిగా సీఎం ఇల్లు
  • నామినేటెడ్​ పదవుల కోసం నేతల ప్రయత్నాలు
  • దరఖాస్తులతో వచ్చిన ఆశావహులు
  • కోడ్​ ముగియడంతో త్వరలో 20 నామినేటెడ్​ పోస్టుల భర్తీ
  • సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపిన కొత్త ఎంపీలు 

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కాంగ్రెస్​ నేతలతో కిటకిటలాడింది. ఎంపీగా గెలిచిన పలువురు పార్టీ నేతలతోపాటు ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవుల ఆశావహులు పెద్ద సంఖ్యలో గురువారం జూబ్లీహిల్స్​లోని సీఎం ఇంటికి వచ్చారు.  పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన గడ్డం వంశీ కృష్ణతోపాటు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు సీఎంను కలిశారు.

ఈ సందర్భంగా వంశీ కృష్ణను  సీఎం రేవంత్​రెడ్డి అభినందించారు. మహబూబాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన బలరాం నాయక్  కూడా రేవంత్​ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఆయనకు సీఎం అభినందనలు తెలియజేశారు. 

దశలవారీగా పదవుల భర్తీ

గురువారంతో ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటన ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ నాయకులు పలువురు.. పీసీసీ చీఫ్​, సీఎం రేవంత్​ని కలిసేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తులను వెంట తీసుకొని రావడంతో వాటన్నింటిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఇవ్వాలని సీఎం సూచించారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులకు, పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లకు తప్పుకుండా నామినేటెడ్ పదవులను ఇస్తామని ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలతో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దశలవారీగా ఈ పదవులను ఇస్తామన్నారు. ఈ మధ్యే 30కి పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చిన సీఎం.. మరో 20 
నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారు. దీనికోసం కసరత్తు కూడా పూర్తయింది.

ఆర్టీసీ, సివిల్ సప్లై, రెడ్కో,  మూసీ రివర్ ఫ్రంట్, హుడా వంటి కార్పొరేషన్ పదవులు, మరి కొన్ని కమిషన్ పాలక మండళ్లను భర్తీ చేయనున్నారు. దీని కోసం పలువురు మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, లోక్ సభ టికెట్లు ఆశించిన వాళ్లు, ఈ రెండు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిన వాళ్లు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా సీఎం ఈ నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు.