రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా

రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా

హైదరాబాద్: రైతు భరోసా స్కీమ్‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా స్కీమ్ వర్తింపజేస్తామని ఆయన ప్రకటించారు. సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ నుండి ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహయం అందజేస్తామని తెలిపారు. 

ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పినప్పటికీ.. ప్రభుత్వ ఆదాయ వనరులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు.. మైనింగ్.. రియల్ ఎస్టేట్ భూములకు.. భరోసా ఉండదని.. రోడ్లు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌, పరిశ్రమలకు తీసుకున్న భూములకు రైతు భరోసా వర్తించదని తేల్చి చెప్పారు. 

గత ప్రభుత్వం రూ.10 వేలే ఇవ్వగా.. మేం మరో రూ.2 వేలు పెంచి మొత్తం రూ.12 వేలు ఇస్తామన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం (జనవరి 4) రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రి మండలి సుధీర్ఘ చర్చించింది. దీనితో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్ర మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.