హైదరాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారని.. ఈ 60 లక్షల మంది విద్యార్థులే తెలంగాణ భవిష్యత్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టూడెంట్స్ వ్యసనాలకు బానిసలు కావొద్దని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యసనపరులను ఖచ్చితంగా అణిచివేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తైంది. ఇవాళ్టి నుండే ప్రజా ఉత్సవాలను ప్రారంభిస్తున్నాం. తెలంగాణ పునర్ నిర్మాణంలో మీరు భాగస్వామ్యులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వరంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని నెహ్రూ దేశంలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చారని.. ఐఐటీ. ఐఐఎంలను తీసుకొచ్చి పేదలకు ఉన్నత విద్యను అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
నెహ్రూ వేసిన పునాదులే నేడు మన భవిష్యత్‌కు కారణమని అన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదేళ్లు విద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని.. గత ప్రభుత్వ తీరు వల్ల పదేండ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని విమర్శించారు. మేం అధికారంలోకి రాగానే విద్య వ్యవస్థపై ఫోకస్ పెట్టామని.. బడ్జెట్లో రూ.21 వేల కోట్లను విద్యాశాఖకు కేటాయించామని గుర్తు చేశారు. బడ్జెట్లో అత్యధికంగా 7 శాతం విద్యాశాఖకు కేటాయించామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం, 31 వేల మంది టీచర్లను బదిలీలు చేశామని వివరించారు. అధికారం చేపట్టిన 65 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. ఏటా రూ.150 కోట్లు కేటాయించి పాఠశాలలు శుభ్రం చేస్తున్నామని తెలిపారు.