తెలంగాణ నుంచే మోడీపై యుద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ నుంచే మోడీపై యుద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కులగణనను నవంబర్ 31లోగా పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్‎గా నిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన పూర్తి చేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు మోదీపై తెలంగాణ నుంచే యుద్ధం ప్రకటిద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. తుక్కుగూడ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా కూడా హామీ ఇచ్చారని చెప్పారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డొచ్చినా చేసి తీరుతుందని చెప్పారు.  రాహుల్ మాటను నిలబెట్టడం ప్రతి కాంగ్రెస్ నాయకుడి కర్తవ్యమని చెప్పారు. 

కాంగ్రెస్‎తోనే రేవంత్‎కు గుర్తింపు

కాంగ్రెస్ పార్టీ లేకుంటే రేవంత్ రెడ్డికి గుర్తింపులేదని, పార్టీతోనే గుర్తింపు, పదవి వచ్చాయని సీఎం అన్నారు. కార్యకర్తలు, నేతలంతా కష్టపడితేనే తనకు ఈ బాధ్యత వచ్చిందని చెప్పారు. పార్టీ జెండాతోనే  ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్నే అమలు చేశామని వివరించారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్‎ను నియమించాలని పీసీసీకి సూచించారు. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని, ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమని చెప్పారు.  

పార్టీకి నష్టం చేకూర్చే వారిని సహించం

కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పార్టీకి నష్టం చేకూర్చేలా ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను చట్టాన్ని అమలు చేస్తానని, వ్యక్తిగత ఎజెండాతో పనిచేయనని చెప్పారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. అగ్రవర్ణాల కోసమే గ్రూప్–1 నిర్వహిస్తున్నారని కొందరు ప్రచారం చేశారని, సెలక్ట్ అయిన 31,383 మందిలో అగ్రవర్ణాలు 10%లోపేనని అన్నారు. 57.11% బీసీలు,15.38% ఎస్సీలు, 8.87% ఎస్టీలు, 8.84% ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారని వివరించారు.