
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం (మార్చి 7) ఇండియా టుడే కాన్క్లేవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం తీర్చుకుంటోందని ఆరోపించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించాలని బీజేపీ కోరుకుంటోందని పేర్కొన్నారు.
‘‘దక్షిణాదిలో బీజేపీకి బలం లేదు. అందుకే డీలిమిటేషన్ ద్వారా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఈ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాదిని అంతం చేయాలని బీజేపీ కోరుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు. అలాగే.. గుజరాత్ మోడల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు విసిరారు.
ALSO READ | డీలిమిటేషన్‌పై తగ్గేదేలే అంటున్న స్టాలిన్.. చెన్నై రావాలని దక్షిణాది రాష్ట్రాలకు లేఖ
గుజరాత్ మోడల్ టెస్ట్ లాంటిదని.. తెలంగాణ మోడల్ టీ20 అని అభివర్ణించారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమన్నారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధిని చూపించి అక్కడికి పెట్టుబడులు తీసుకెళ్లారని ఆరోపించారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ లేరని.. దీంతో ఇప్పటికీ ఆయనే గుజరాత్‌ను ప్రోత్సహించాల్సి వస్తోందని అన్నారు.
మోడీ ఒక్క గుజరాత్‌కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని.. భారతదేశానికి వచ్చే పెట్టుబడిదారులకు గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల పట్ల ఆయన పక్షపాతం చూపిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన..ఈ మూడు తెలంగాణ మోడల్ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో అహ్మదాబాద్ కు ఏ మాత్రం పోలిక లేదని అన్నారు. దేశవ్యాప్తంగా ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు తెలంగాణలోనే తయారవుతున్నాయని, 35% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
మేం అహ్మదాబాద్, ముంబై లేదా బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడటం లేదని.. న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నామని అన్నారు. తెలంగాణ మోడల్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుస్తామన్నారు. 20,000 ఎకరాల భూమిలో అద్భుతమైన ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణను చూడండి.. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాన్ని నిర్మించబోతున్నామని నొక్కి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.