![చంద్రబాబు, KCR వచ్చింది యూత్ కాంగ్రెస్ నుంచే.. అది యూత్ కాంగ్రెస్ పవర్: సీఎం రేవంత్](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddys-key-comments-on-kcr-and-chandrababu_RF1B9TsGvj.jpg)
హైదరాబాద్: చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని.. వీరితో పాటు పార్టీలోని అగ్ర నాయకులు అంతా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని.. అది యూత్ కాంగ్రెస్కు ఉన్న పవర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ బలం, బలగమని.. యూత్ కాంగ్రెస్ శక్తి ఏమిటో మాకు తెలుసని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. శుక్రవారం (ఫిబ్రవరి 14) గాంధీభవన్లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
ALSO READ | రెండేళ్లలో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పూర్తి చేయాలి: సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మిట్టపలి వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కష్టపడి పని చేస్తే పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని.. అనిల్ యాదవ్, బల్మూరి వెంకటే ఇందుకు నిదర్శమని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వీరిద్దరికి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. కొందరు పదవులు రావడం లేదని నిరాశ చెందుతున్నారు.. టైమ్ వచ్చినప్పుడు అవకాశాలు వస్తాయి.. ఎవరూ పోరాటం ఆపొద్దని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కేసీఆర్ మోసం చేస్తే మనకు అధికారం
దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. భూమి లేని వ్యవసాయ కూలీలకు రైతు ఆత్మీయ భరోసా కింద ర.12 వేలు ఇస్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ ఊరించి మోసం చేశారని.. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారని అన్నారు.
ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ దేనని అన్నారు. మాకు పాలనే సరిపోతుందని.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మీరే తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు పదవి ఇస్తామన్నారు. డబ్బులతోనే గెలిచే అవకాశం ఉంటే.. కేసీఆర్ 100 సీట్లు గెలిచే వారని.. సొమ్ముతోనే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమ వీడండని సూచించారు. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడండని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.