హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2024, నవంబర్ 25న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. జైలుకు వెళ్తే సీఎం అవొచ్చని ఆయన అనుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబం నుండి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారు. జైలుకెళ్లినవాళ్లు సీఎం అయ్యేదుంటే కేటీఆర్ కంటే ముందు కవిత సీఎం అవుతారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ వర్శిటీకి గౌతమ్ అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిదానికీ ఓ విధానం అంటూ ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందని వివరిస్తూనే.. కేటీఆర్ కు కొత్త పేరు పెట్టారు.. ఇక నుంచి కేటీఆర్ కాదని.. సైకో రాం.. కేటీఆర్ పరిస్థితి.. కేటీఆర్ కే తెలియటం లేదంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
కేటీఆర్ పక్కన పని చేసే వాళ్లకే ఆయన చేష్టలు అర్థం కావటం లేదని.. ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ విమర్శలు చేశారాయన. ఈ సందర్భంలో కేటీఆర్‌ను.. ఇక నుంచి సైకో రాం అని పిలుస్తాం అని.. ఆయనకు సైకో రాం అనే పేరు కరెక్ట్ అంటూ చురకలు అంటించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మందిపై.. కొన్ని మీడియా ఛానెల్స్‌పై నిషేధం విధించిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే సైకోలా మాట్లాడుతున్నాడంటూ.. కేటీఆర్‌కు.. సైకో రాం కరెక్ట్ పేరు అంటూ చురకలు అంటించారు సీఎం రేవంత్ రెడ్డి.