హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ పునర్జీవ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం (అక్టోబర్ 29) మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ ఎంత అడ్డుకునేందుకు ప్రయత్నించినా మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని తేల్చి చెప్పారు. మూసీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫస్ట్ ఫేస్‌లో 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తామని తెలిపారు.
గండిపేట, హిమాయత్ సాగర్ల నుండి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతామని స్పష్టం చేశారు. నెల రోజుల్లో డీపీఆర్ డిజైన్లు పూర్తి అవుతాయన్నారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం.. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగామని తెలిపారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు.
ALSO READ | తప్పు చేయకుంటే కేటీఆర్ బామ్మర్ధి ఎందుకు పారిపోయాడు : సీఎం రేవంత్ రెడ్డి
మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మూసీ వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్టుపై విపక్షాలతో చర్చకు సిద్ధమని.. త్వరలోనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.