
హైదరాబాద్: తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై లెక్కలతో సహా ప్రతిపక్ష బీఆర్ఎస్ను అసెంబ్లీలో కడిగిపారేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం (మార్చి 27) ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడే నాటికి రాష్ట్ర అప్పు 72,615 కోట్లు. ఇతర కార్పొరేషన్ల అప్పు రూ.16,900 కోట్లు. ఇతర గ్యారెంటీల కింద తెచ్చిన అప్పులు రూ.5000 వేల కోట్లు. ఇవి మొత్తం కలిపి రూ.90,161 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్కు అప్పగించాం.
2023లో మళ్లీ మేం అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న అప్పులు రూ.6.69 లక్షల కోట్లు. ఇతర బకాయిలతో కలిపి తెలంగాణ అప్పులు రూ.7.05 లక్షల కోట్లు’’ అని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టారు. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పగించి వెళ్లారని ఫైర్ అయ్యారు. మేం అధికారంలోకి వచ్చాక 15 నెలల్లో రూ.1.58 వేల కోట్లే అప్పు చేశాం. అందులో బీఆర్ఎస్ చేసిన అప్పులకే సగం మిత్తీలు కట్టామన్నారు. రాష్ట్ర అప్పులకు మిత్తీలు కట్టేందుకే రూ.6లక్షల కోట్లు తేవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మీరు చేసిన అప్పులు, తప్పులకు రాష్ట్రం శిక్ష అనుభవించాల్సి వస్తోందని విమర్శించారు.
Also Read :- నేను తల్చుకుంటే మీ ఫ్యామిలీలో ఒక్కరూ బయట ఉండరు
బీఆర్ఎస్ ప్రభుత్వ చేసిన రైతు రుణమాఫీపైన సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారు.. ఎన్నికలయ్యాక రుణమాఫీకి ఐదేళ్లు పట్టింది.. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదని.. తీరా ఎన్నికల ముందు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు రుణమాఫీ చేశారు.
కానీ, మేం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు.. రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. వాళ్లు పదేళ్లలో చేసిన దానికంటే మేం పది నెలల్లోనే ఎక్కువ చేశామని.. ఎన్నికల సమయంలో వాళ్లు ఎగ్గొట్టిన రైతు బంధు కూడా మేమే ఇచ్చామని అన్నారు. వాళ్లు పదేళ్లలో చేయలేని పనులను 10 నెలల్లోనే మేం చేస్తే ఓర్వలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు.