ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో.. అలాంటి తల్లినే తెచ్చుకున్నం: CM రేవంత్

ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో.. అలాంటి తల్లినే తెచ్చుకున్నం: CM రేవంత్

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో 2024, డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. సెక్రటేరియట్ లో ప్రభుత్వం ఆవిష్కరించింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ తల్లి విగ్రహం అని ప్రతి పక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లి విగ్రహన్ని రాచ మర్యాదలతో గాంధీ భవన్‎కు పంపిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ బతుకమ్మ చరిత్రను చరిపేసే కుట్ర చేస్తోందని బీజేపీ ఆరోపించింది.

మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్  దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనాన్ని శనివారం (డిసెంబర్ 14) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు జమిందారుల తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. 

ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో.. అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నామని కౌంటర్ ఇచ్చారు. ఒక పక్క వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి  తెలంగాణలో పండించే పంటలు.. మరోవైపు నా బిడ్డలు చల్లంగా ఉండాలి.. నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పథంవైపు నడవాలని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని మనం ప్రతిష్టించుకున్నామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్‎లో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహం..  మన అమ్మకు.. మన అక్కకు ప్రతిరూపమని అభవర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి.