కలెక్టర్లనైనా బదిలీ చేయొచ్చు కానీ.. టీచర్ల ట్రాన్స్‎ఫర్ ఆషామాషీ కాదు: సీఎం రేవంత్

కలెక్టర్లనైనా బదిలీ చేయొచ్చు కానీ.. టీచర్ల ట్రాన్స్‎ఫర్ ఆషామాషీ కాదు: సీఎం రేవంత్

హైదరాబాద్: విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగానికి సూచనల కోసం కమిషన్ ఏర్పాటు చేశామని.. విద్యాశాఖ కమిషన్ చైర్మన్‎గా ఐఏఎస్ అధికారిని నియమించామని తెలిపారు. విద్యా కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సలహాలు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం శాసన మండలిలో విద్యాశాఖపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

2021లో తెలంగాణలోని 3, 5వ తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్‎మెంట్ సర్వే జరిగిందని.. ఆ స్టడీ ప్రకారం 75 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు  చూపట్లేదని అన్నారు. ఈ సర్వేలో తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉందన్నారు. 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరిజ్ఞానంలో తెలంగాణ 36వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అదే విధంగా 3వ తరగతి విద్యార్థులకు గణిత పరిజ్ఞానంలో తెలంగాణ 35వ స్థానంలో ఉందని చెప్పారు.దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ విషయంలో తెలంగాణ అధమ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. 

ALSO READ | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో.. మాటల్లో కాదు చేతల్లో చూపించాం: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు.. రెండో తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి ఉందన్నారు. ప్రతిస్థాయిలో విద్యారంగం రోజురోజుకు క్షీణించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగాన్ని తిరిగి గాడినపెట్టడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 11 వేలకు పైగా టీచర్ల నియామకం చేపట్టాం.. 21 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఏడెనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న 36 వేల మంది టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టామన్నారు. కలెక్టర్లనైనా బదిలీ చేయవచ్చు కానీ.. టీచర్ల ట్రాన్స్‎ఫర్లు ఆషామాషీ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 36 వేల మంది టీచర్లను చిన్న ఆరోపణలు లేకుండా బదిలీ చేశామని గుర్తు చేశారు.