మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్

మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్

హైదరాబాద్: గత పదేళ్లు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని.. ఇప్పుడు చంద్రగ్రహణం అంతరించడంతో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా బీఆర్ఎస్‎పై  విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎‎లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా శక్తి సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇందిరమ్మ పాలన రావాలని మహిళలు కోరుకున్నారని.. వారి కోరిక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 

ALSO READ | మహిళాసంఘాలకు సీఎం రేవంత్రెడ్డి గుడ్న్యూస్..సభ్యుల ఏజ్ లిమిట్ పెంపు

పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మధ్య ఉన్న తేడాను మహిళలు గమనిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు మహిళలను అన్ని రంగాల్లో విస్మరించిందని.. కేసీఆర్ మొదటి టర్మ్‎లో ఆయన కేబినెట్‎లో ఒక్క మహిళా కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శమని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారని.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ నిర్వహణ వారికే అప్పగించామని తెలిపారు.

 గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు యూనిఫామ్  కుట్టే బాధ్యతను కూడా మహిళా స్వయం సహాయ సంఘాలకే ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోడౌన్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా చేస్తామని.. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఇందిరా శక్తి భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. సోలార్ ఉత్పత్తిలో అదానీ, అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీపడేలా చేస్తామని పేర్కొన్నారు.

 దివంగత ప్రధాని ఇందిరాను అమ్మ అన్నారు.. దివంగత సీఎం ఎన్టీఆర్‎ను అన్నా అన్నారు.. ఇప్పుడు నన్ను రేవంతన్న అంటున్నారు.. మీతో పేగు బంధం కలిగిన మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ఎండకు పంటలు ఎండిన బీఆర్ఎస్ నేతలు నన్ను తిడుతున్నారు.. ఎక్కడ చిన్నా ప్రమాదం జరిగినా నన్నే దూషిస్తున్నారు.. తనను తిడుతూ బీఆర్ఎస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు.