
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోడెద్దుల్లా శ్రమిస్తు్న్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాగే నిరంతం శ్రమిస్తూనే ఉంటాని అన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తోందన్నారు. ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంధ్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నానని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఇక, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని.. రాష్ట్రంలోని యువతకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశంలోని కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమునాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా షడ్రుచుల కలయిక మాదిరి ఉందని.. బడ్జెట్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామని తెలిపారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని.. ఇందులో భాగంగా అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని.. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ అంటే కేవలం ప్రజలు నివసించే నగరమే కాదని.. పెట్టుబడుల నగరమని అన్నారు.
లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి.. ఏ విధానానికి నూటికి నూరు శాతం ఆమోదం ఉండదు. దేవుళ్లను విశ్వసించే విషయంలోనే ఏకపక్ష ఆమోదం ఉండదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీమంతులు మాదిరే పేదలూ సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని.. అందుకే రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
2025, మార్చి 30న రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘‘గతేడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి సాధించాం. తద్వారా దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా రికార్డ్ సృష్టించాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదు. సన్నం పండిస్తే రైతులకు బోనస్ కూడా ఇస్తున్నాం. రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం మంది సన్న బియ్యం పండిస్తున్నారు’’ అని అన్నారు.