వరంగల్: రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీపై భద్రకాళి.. సమ్మక్క సారక్క సాక్షిగా నాడు రైతులకు ఇచ్చినా హామీ నెరవేర్చాను.. వరంగల్ గడ్డ సాక్షిగా మళ్ళీ మాట ఇస్తున్నా.. మిగిలిన ప్రతీ రైతుకు రుణ మాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెడతాం.. బిల్లా రంగా ఎవరొస్తారో రండి అని కేటీఆర్, హరీష్ రావుకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం- ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 19) వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18500 కోట్లలో రూ.6500 కోట్లు జీతాల రూపంలో.. మరో రూ.6000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ రూపంలో పోతున్నాయని.. దీనిపై చర్చించేందుకు అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్కు ఉందా అని సవాల్ విసిరారు. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో తేదీ చెప్పాలని.. అప్పుడే అసెంబ్లీలో చర్చ పెడదామని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదని.. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ లోనే ఉండాలని గులాబీ బాస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్.
ALSO READ | కిషన్ రెడ్డీ.. గుజరాత్ వెళ్లి గాడిదలు కాసుకో : సీఎం రేవంత్ రెడ్డి
తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ పదేండ్లలో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు ఇప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. ఈ క్రమంలోనే మిగిలిన రైతులకు త్వరలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.