హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు తక్షణమే సహయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్‌కు సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోడీని కోరారు. వర్షాలు, వరదల వల్ల సంభవించిన అపార నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతోన్న సహయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ALSO READ : ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు
వరదల్లో చిక్కుకుని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తోన్న రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.5 ఐదు లక్షలకు పెంచారు. ఈ రివ్యూ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఖమ్మం పర్యటనకు వెళ్లారు. రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరిన రేవంత్.. ఖమ్మంలో మున్నేరు వాగు బీభత్సానికి గురైన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.