- అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా
- సీఎం రేవంత్ వ్యాఖ్యలు: బండి సంజయ్
- తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతీస్తారా?
- ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళ మృతి
- ఆ తప్పు ఇతరులపైకి నెట్టడం సిగ్గుచేటని విమర్శ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని, తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరు.. ఆయన స్థాయికి ఏ మాత్రం సరికాదన్నారు. టాలీవుడ్‌పై కక్షసాధింపు చర్యలు వీడాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లడంలో అల్లు అర్జున్ సహా తెలుగు నటీనటులు, దర్శక నిర్మాతలు చేస్తున్న కృషి మరువలేమన్నారు.
అయినా పనిగట్టుకుని అల్లు అర్జున్ను, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం, దానికి అసెంబ్లీని వేదికగా మార్చుకోవడం బాధాకరమన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు. ప్రజాసమస్యలను దారి మళ్లించేందుకు కావాలనే సీఎం మళ్లీ ఆ సమస్యను తెరపైకి తేవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం వాళ్లతో ప్రశ్న అడిగించుకుని సమాధానం ఇవ్వడం సిగ్గు చేటని చెప్పారు.
అసెంబ్లీ సాక్షిగా స్టోరీ అల్లారు
పోలీసులకు సమాచారం ఇచ్చాకే సంధ్య థియేటర్ కు వచ్చినట్లు అల్లు అర్జున్ చెబుతున్నారని, అయినా సినిమా వాళ్లకు మించి సీఎం అసెంబ్లీలో సినిమా తరహాలో స్టోరీ అల్లడం విస్మయం కలిగిస్తోందని సంజయ్ పేర్కొన్నారు. సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్‌కు రావడం 50 ఏండ్లుగా సాధారణమేనన్నారు. ముందస్తు భద్రత ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో పాటు హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఒక రాత్రంతా జైల్లోనే ఉంచడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని వెల్లడించారు. ‘ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తింటూ విద్యార్థులు చనిపోతుంటే మీరెందుకు బాధ్యత వహించడం లేదు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాము కాటుకు గురై నిత్యం స్టూడెంట్లు ఆసుపత్రుల పాలై చనిపోతుంటే మీతో పాటు బాధ్యులైన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? మీకు ఒక న్యాయం? ఇతరులకు ఒక న్యాయమా?’’ అని సీఎంను ప్రశ్నించారు.
శ్రీతేజ్‌ను పరామర్శించిన బండి సంజయ్
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయాల పాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.