హైదరాబాద్: ఆదాయ సమీకరణపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆదాయ సమీకరణాలకు ఉన్న అవకాశాలను సీఎం ఆరా తీశారు. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు మోపిందని, అప్పటి అప్పులకు వడ్డీలుకట్టేందుకే రాష్ట్ర ఖజానాలో మెజార్టీ వాటా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఓ వైపు ఆదాయ మార్గాలు తగ్గుతుంటే అప్పుల భారం పెరుగుతుంటడంతో ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ఈ సమీక్షలో సీఎం చర్చించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలకు ఎక్కడా ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఎం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.