ఇబ్బంది పెట్టొద్దు.. వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేయండి: సీఎం రేవంత్

ఇబ్బంది పెట్టొద్దు.. వెంటనే  రైతుల అకౌంట్లలో డబ్బులు వేయండి: సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలో  రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్‎తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం

సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సన్న వడ్లపై ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్‎తో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతుల్లో  భరోసా కల్పించాలని అధికారులకు సూచన చేశారు.

రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందని తెలిపారు సీఎం రేవంత్.  సన్నరకాలకు తెలంగాణలో బోనస్ అందిస్తుండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తున్నారని, అలాంటి వాటి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్‌చార్జి మంత్రులు, ఇన్‌చార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షిస్తూ రోజూవారి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

ALSO READ | వరిసాగులో తెలంగాణ టాప్.. వ్యవసాయ శాఖకు హై ప్రియారిటీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

2024, నవంబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు పండగను జరుపబోతున్న సందర్భంగా అంతకుముందు 28, 29, 30 తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందున ఆ సదస్సును  విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‎లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.