రెండేళ్లలో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పూర్తి చేయాలి: సీఎం రేవంత్ ఆదేశం

రెండేళ్లలో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పూర్తి చేయాలి: సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‏కు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం (ఫిబ్రవరి 14) విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించునున్న ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల సేకరణ, ఇతర పనుల పురోగతిని ఆరా తీశారు సీఎం రేవంత్.  

నియోజకవర్గాల్లో ఎక్కడైతే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చోట అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి త్వరగా స్థలాలను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, దీనిపై వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.

ALSO READ | కేసీఆర్, రేవంత్ ఇద్దరు కలిసి రండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

 ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని సూచించారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో వంద శాతం పనులు పూర్తికావాలని ఆదేశించారు. అలాగే.. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా పూర్తి స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.