హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయంలో మంగళవారం (అక్టోబర్ 29) ఆయన జర్నలిస్టులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరు వల్ల మూసీ మురికికూపంగా మారడంతో పాటు కబ్జాలకు గురైందని అన్నారు. మూసీని మేం కూడా అలాగే వదిలేస్తే.. రాబోయే రోజుల్లో మూసీ వందశాతం కబ్జా అవుతోందని అన్నారు. ఎవరు అడ్డుపడ్డా.. మూసీ పునర్జీవం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుండి రూపాయి ఖర్చు లేకుండా మూసీ పునర్జీవం చేస్తామన్నారు. ఐదేండ్లలో హైదరాబాద్ నగర అభివృద్ధికి లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ భూములు అమ్మలేదని క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మరో నగరం సృష్టిస్తున్నామని చెప్పారు. ఇక, ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు.
హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం డౌన్ ఫాల్ అయ్యిందనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. హైడ్రా వల్లే రియల్ ఎస్టేట్ రంగం పడిపోతే.. మరీ వరంగల్‌లో హైడ్రా లేదు.. అక్కడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెవెన్యూ డౌన్ ఫాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండే జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం లిక్కర్ సప్లైర్లకు రూ.4వేల కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.52 వేల కోట్లు పెండింగ్ పెట్టారని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు గోడల మధ్య ఉండే వ్యక్తి అని.. నేను ప్రజల మధ్య ఉండే వ్యక్తినని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందని.. వీటికి సంబంధించిన రిపోర్టులు రాగానే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.