హైదరాబాద్: మూసీ పునర్జీవనాన్ని అడ్డుకోవడానికి కొంత మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. అధికారం కోల్పోయిన వాళ్లు ఇలా ప్రతీ అభివృద్ధి పనిని అడ్డుకోవాలని చూస్తారని బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బందిపోటు దొంగల్లా.. రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకున్నారు.. అధికారులు, మంత్రుల మసుగులో రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటు దొంగలు వాళ్లని ధ్వజమెత్తారు. మూసీ కంటే మురికి బీఆర్ఎస్ నేతల మెదల్లోనే ఉందని నిప్పులు చెరిగారు.
మూసీ నది ప్రక్షాళన, పునర్జీవనంపై 2024, అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరం మధ్య గుండా నది వెళ్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరహాలో దేశంలో మరొకటి లేదు.. అలాంటి మూసీ నదిని గత పాలకులు మురికి కూపంలోకి నెట్టారని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు.
ALSO READ | రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కృషి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మేం చేసేది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ నది పునర్జీవనమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం కక్కతున్నారని మండిపడ్డారు. చిన్న వయస్సులోనే నాకు అన్ని వచ్చాయని.. నాకు ఇంకా ఆశ లేదన్న సీఎం.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే మూసీ ప్రాజెక్ట్ పునర్జీవనం చేపట్టామని క్లారిటీ ఇచ్చారు.
మేం పని చేసిది అద్దాల మేడలు.. అందాల భామల కోసం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమని.. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలు ఎప్పటికీ బాగుపడొద్దన్నదే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని విమర్శించారు. దామ గుండంలో నిర్మించనున్న నేవీ రాడార్ స్టేషన్ విషయంలోనూ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని అసహనం వ్యక్తం చేసిన సీఎం.. దేశ భద్రతను వ్యతిరేకించిన వాళ్లు టెర్రరిస్ట్ కసబ్ కంటే చరిత్రహీనులని విమర్శించారు.