కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్కుపై  సీఎం స్పెషల్‍ ఫోకస్‍

 

  • పార్కులో స్థానికులకు ఉద్యోగాలిచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
  • పార్కులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  • భూములు కోల్పోయిన 863 మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు

వరంగల్‍, వెలుగు : కాకతీయ మెగా టెక్స్ టైల్‍  పార్క్  అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈ పార్కు కోసం భూములిచ్చిన 863 మంది నిర్వాసితులకు ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‍బాబు అన్నారు. పార్కులో స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని, స్కిల్‍ ట్రైనింగ్‍ సెంటర్లను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ ఇప్పించి పార్కులో వారికి కూడా ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

శనివారం గీసుగొండ మండలం శాయంపేటలోని కాకతీయ టెక్స్ టైల్‍ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. పీహెచ్‍సీ భవనం, వెటర్నటీ హస్పిటల్‍, మైక్రో మినీ స్మాల్‍ ఇండస్ట్రీస్‍  పార్క్, రోడ్లు, డ్రెయిన్లు, వాటర్‍  సప్లై పనులకు మంత్రి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. అలాగే,  సంగెం మండలం లోహిత నుంచి గోపనపల్లి వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకూ ఆయన భూమిపూజ చేశారు. అనంతరం భూ నిర్వాసితులకు ప్లాట్ల పట్టాలు అందించి, డ్రా పద్ధతిలో కేటాయింపును ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన సభలో శ్రీధర్‍బాబు మాట్లాడారు. గత బీఆర్‍ఎస్‍  ప్రభుత్వం తమకు అప్పులను వారసత్వంగా ఇచ్చిందని, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. టెక్స్ టైల్‍  పార్కు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పార్కులో పూర్తిస్థాయిలో పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కొందరు భూనిర్వాసితులకు కోల్పోయిన భూమి ఆధారంగా 50 గజాల స్థలమే ఇచ్చారని, దానిని కనీసం 75 గజాలు లేదా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుగుణంగా కేటాయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‍  చైర్మన్‍  సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‍  రావుల రాజేశ్వరరావు, టీజీఐఐసీ చైర్‍పర్సన్‍  నిర్మల, కుడా చైర్మన్‍  ఇనగాల వెంకట రామిరెడ్డి, కలెక్టర్‍ సత్యశారద పాల్గొన్నారు. 

సీఎం చొరవతోనే పీఎం మిత్ర రూ.450 కోట్లు మంజూరు 

టెక్స్ టైల్‍  పార్కు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో రావాల్సిన రూ.450 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించారని వరంగల్‍  ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్‍  అభివృద్ధే లక్ష్యంగా మామునూర్‍  ఎయిర్‍పోర్టు, కోచ్‍ ఫ్యాక్టరీ, యూజీడీ ప్రాజెక్టులకు రూ.5  వేల కోట్లు మంజూరు చేశారని ఆమె పేర్కొన్నారు.