
- ఆరు నెలల్లో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తాం
- వచ్చే నెల నుంచి సీఎం కప్ పోటీలు
- స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, క్రీడల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ క్రీడాకారుడికి చేయూతను అందించేలా, యువత క్రీడల పట్ల ఆకర్షితులు అయ్యేలా మరో ఆరు నెలల్లోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. క్రీడా పాలసీలో పొందుపరిచే ప్రతీ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారని చెప్పారు. ‘గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసింది. పదేండ్లయినా స్పోర్ట్స్ పాలసీని రూపొందించలేకపోయింది. కానీ, మేము ఒక ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నాం. క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యతను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా వివరించారు. బడ్జెట్‌లో క్రీడలకు అత్యధికంగా రూ. 364 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్‌లో ఇటీవలే ఇంటర్‌కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ను నిర్వహించాం. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు కొత్త రూపు ఇచ్చిన విధంగా రాజధానిలోని ఇతర స్టేడియాలను కూడా పునరుద్ధరించి, వాటిలో జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. నూతన స్పోర్ట్స్ పాలసీలో గ్రామీణ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి లోక్ సభ నియోజక వర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేసి వాటిని రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తాం. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ప్రతీ క్రీడాకారుడి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అత్యంత పారదర్శకంగా వారికి అవసరమైన ఆర్థిక, ఇతర సహకారాలు కల్పిస్తాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం’ అని శివసేనా రెడ్డి తెలిపారు.