- పదేండ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది
- ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడ్తున్నరు
- లగచర్లలో మంటపెట్టి.. దాడులు చేయించి.. ప్రజలను ఆగం జేసిన్రు
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉచ్చులో పడి కేసుల్లో ఇరుక్కోవద్దు
- పాలమూరును కూడా అభివృద్ధి చేస్కోకపోతే చరిత్ర క్షమించదు
- పరిశ్రమలకు భూములిస్తే ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వడానికైనా రెడీ
- రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ, కేసీఆర్ సిద్ధమా? అని సవాల్
- పాలమూరులో ఘనంగా ‘రైతు పండుగ’ ముగింపు వేడుక
మహబూబ్‌నగర్, వెలుగు : పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం పట్టించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి బలి చేయాలని చూస్తున్నారని, అలాంటి మాయగాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. ‘‘లగచర్లలో మంట పెట్టి.. ఆఫీనర్లను కొట్టించి, కలెక్టర్‌పై దాడులు చేయించి అమాయక లంబాడీలను జైలుకు పంపించిన్రు. బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మొద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్న. జనాన్ని ఉచ్చులోకి దింపడమే వాళ్ల పని. తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లనే చేసిన్రు. నాడు అగ్గిపెట్టె రావు వంద రూపాయలు పెట్టి సీసా పెట్రోల్ తెచ్చుకున్నడు కానీ.. పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేదు. ఆ నేతల మాటలు విన్న పిల్లలపై నాడు కేసులైనయ్? ఇప్పుడు కూడా అమాయక ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నరు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్లు కేసీఆర్ చేసిన దోపిడీకి తెలంగాణ బలైందని.. ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై తీరని భారం మోపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో శనివారం 'రైతు పండుగ' ముగింపు కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Also Read : జీవో 317 పరిష్కారానికి కొత్త గైడ్‌లైన్స్
భూములు గుంజుకొని నేనేం చేస్త..
తనను గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందులో భాగంగా 1,300 ఎకరాలు భూ సేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తేవాలని అనుకున్నానని, దీని వల్ల 20 వేల నుంచి 30 వేల మందికి ఉపాధి కల్పించొచ్చనే ఆలోచన చేశానని తెలిపారు. కానీ కొందరు చిచ్చు పెట్టి అధికారులపై దాడులు చేయించి, అమాయక లంబాడీలను జైలుకు పంపించారని ఆయన అన్నారు. ‘‘పాలమూరు జిల్లాపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పగబట్టిన్రు. నాడు ఉద్యమ టైమ్‌లో పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించుకుంటే.. పదేండ్లు పాలమూరుకు చేసిందేంది? ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపడ్తుంటే అడ్డుపడ్తున్నరు.
వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా పాలమూరును అభివృద్ధి చేసి తీరుతాం. మాయగాళ్ల మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తదో.. కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటరో తెలియదు. మీరు జైలుకు వెళ్లడం వల్ల మీ కుటుంబాలే ఆగమైతయ్తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఏమీ కాదు. వాళ్లు ఫామ్ హౌస్‌లకు వెళ్లిపోయి హాయిగా ఉంటరు’’ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ టైమ్‌లోనూ బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారని, వాళ్ల మాటలు నమ్మినందుకు చాలా మంది పిల్లలపై కేసులయ్యాయని అన్నారు. అట్ల కేసులైన వాళ్లు ఇప్పుడు తన దగ్గరకు వచ్చి కేసులను తీసేయాలని కోరుతున్నారని చెప్పారు.
రుణమాఫీపై చర్చకు మోదీ, కేసీఆర్ సిద్ధమా?
'రైతు పండుగ' చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ అంటోందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న మీరు, నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని రైతులకు చెప్పి ఏం చేశారు? 2018 నుంచి 2023 వరకు రూ.లక్ష రుణమాఫీ అన్నడు. మొదటి నాలుగేండ్లు అణా పైసా ఇవ్వలే. ఆఖరి ఏడాది ఔటర్ రింగ్గు రోడ్డును అమ్మి రూ.11 వేల కోట్లు రైతులు ఖాతాలో వేసిండు. ఇందులో రూ.8,596 కోట్లు మిత్తీకి పోయింది. అసలు చెల్లించింది రూ.2,500 కోట్లే. హరీశ్ రావు.. ఔటర్ రింగ్ రోడ్డును 7,500 కోట్లను అమ్మి మీరు చెల్లించిన అసలు రూ.2500 కోట్లు. అసెంబ్లీకి రా లెక్కలు చెప్త. ఐదేండ్లలో మొదటి ఏడాదిలోనే రుణమాఫీ చేసి ఉంటే ఈ 8,500 కోట్లు మిత్తీలకు కాకుండా రైతుల అసలుకు సరిపోతుండె” అని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రైతులను రుణ విముక్తుల్ని చేశామని సీఎం అన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా పది నెలల 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు రూ.17,869 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? చర్చలకు మోదీ, కేసీఆర్ వస్తరా?” అని ఆయన చాలెంజ్ చేశారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో 3.13 లక్షల మంది రైతులకు కూడా ఈ వేదిక ద్వారా రూ.2,747 కోట్లను చెల్లించామని.. దీంతో మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, రైతు రుణమాఫీ కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.54వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.
వలసల నివారణకు చర్యలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఈ ఏటా జిల్లాకు డెవలప్మెంట్ కోసం రూ.20 వేల కోట్ల నిధులు తెస్తానని, ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు నిధులతో పాలమూరును డెవలప్ చేస్తామని తెలిపారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ వచ్చాక ఆయన సీఎం అయినప్పటికీ పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఆయన ప్రభుత్వ హయాంలో ఈ జిల్లాను ఎడారిగా మార్చి, వలసలను శాశ్వతం చేసిండు. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరు, కల్వకుర్తి, నారాయణపేట-–కొడంగల్ పనులు చేయాలని మేం నిధులు విడుదల చేస్తుంటే అడ్డుకోవాలని చూస్తవా? ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదు. మళ్లీ పాలమూరు బిడ్డకు అవకాశం రాదు. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. కొడంగల్ స్కీమును ప్రారంభిస్తున్నం. పాలమూరుకు లా, ఇంజీరింగ్ కాలేజీలు, కొడంగల్‌కు మెడికల్ కాలేజ్ మంజూరు చేశాం. త్వరలో పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తం” అని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ. 20 లక్షలైనా ఇస్తం.. కానీ, అభివృద్ధికి అడ్డుపడొద్దు
కొడంగల్ నియోజకవర్గంలో 1,300 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండొద్దా? అని సీఎం ప్రశ్నించారు. దీన్ని స్థాపిస్తే పరిశ్రమలు వచ్చి యువత కు ఉద్యోగాలు వస్తాయన్నారు. ‘'కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. మా వద్ద 1,300 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండొద్దా? నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు కొందరు రైతులు భూములు కోల్పోయారు. నాడు బాధను మింగి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు. ఆఫీసర్ల మీద ఎన్నడూ దాడులు చేయలేదు. అట్ల చేస్తే శ్రీశైలం వస్తుండేనా? నాగార్జునసాగర్, జూరాల అయితుండేనా? నడిగడ్డ పౌరుషం మీకు తెల్వదా? డెవలప్ మెంట్ చేయాలంటే కొందరికి కొంత నష్టం ఉంటుంది.
కావాలనే పాలమూరులో డెవలప్మెంట్ను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అడ్డుకుంటున్నరు. వాళ్ల మాయలో పడొద్దు. అభివృద్ధికి అడ్డుపడొద్దు” అని సూచించారు. ‘‘రైతులు, పాలమూరు బిడ్డలు అండగా ఉంటే పాలమూరును అభివృద్ధి చేసుకోవచ్చు. ఎకరాకు పది లక్షలు కాదు.. రూ.20 లక్షల ఇచ్చే శక్తి ప్రభుత్వానికి ఉంది. మీ ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత నాది. చదువుకున్నోళ్లు, చదువురానోళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. పరిశ్రమలు వస్తే.. ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తయ్. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం మారుతుంది” అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కాళల్లో కట్టెలు పెడుతున్నారని, పరిశ్రమలు రాకుండా భూ సేకరణను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
హరీశ్‌రావుది మొసలి కన్నీరు
మల్లన్న సాగర్‌లో మల్లారెడ్డి అనే రైతు భూమి పోయిందని.. ఆవేదనతో ఆయన చితి పేర్చుకొని.. ఆ చితి మీద పడుకొని నిలువు తగలబెట్టుకున్నారని సీఎం రేవంత్ ఆవేదనవ వ్యక్తంచేశారు. అప్పుడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకుంటే హరీశ్‌రావుకు ఎందుకు కన్నీళ్లు రాలేదని, ఆ కుటుంబాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. ‘‘మల్లారెడ్డి కుటుంబాన్ని మీరు ఆదుకున్నారా? ఆయన ఇంటికి వెళ్లి అడుగుదామా? హరీశ్‌రావు సిద్ధమా?” అని సవాల్ చేశారు. హరీశ్‌రావుకు రైతులపై కపట ప్రేమ అని, పాలమూరుపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ‘‘పాలమూరులో అభివృద్ధి జరగొద్దని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కుట్ర పన్నుతున్నరు. ఇక్కడి బిడ్డగా అభివృద్ధి చేయకపోతే చరిత్ర నన్ను క్షమించదు. చరిత్రలో క్షమించరాని నేరం నాతో చేయించాలన్న కుట్రలో భాగంగానే అభివృద్ధికి వాళ్లు అడ్డుపడ్తున్నరు. వారి ఆటలు సాగవు. ఎవరు అడ్డు వచ్చినా పాలమూరుకు నిధులు తెచ్చి నీళ్లు పారిస్త. కొడంగల్‌కు పారిశ్రామిక వాడను తీసుకొస్త.. ఇది నా జిమ్మేదారి” అని సీఎం స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడ్తున్నయ్
‘‘కేసీఆర్ కుటుంబం నా గురించి, ప్రజా ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్తున్నది. దీన్ని అందరూ గమనించాలి. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏం చేసిండు. వరి వేస్తే ఉరి అని రైతులను తిప్పలు పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వరి వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నది. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడుతుంటే బీఆర్ఎస్ లీడర్ల గుండెల్లో పిడుగులు పడుతున్నయ్” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ పదేండ్లు కాళేశ్వరం, పీఆర్ఎల్ఐ పేరిట కాంట్రాక్టర్ల కోసం రూ. 1.83 కోట్లు ఖర్చు చేసిండు. ఇందులో రూ.1.02 లక్షల కోట్లతో కాళేశ్వరం కడ్తే.. సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కుప్పకూలినయ్. వీటిలో చుక్క నీరు లేకున్నా.. అప్పట్లో కాంగ్రెస్ కట్టిన శ్రీశైలం, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, ఇందిరా సాగర్, సీతారాం సాగర్ ద్వారా పంటలు బాగా పండుతున్నయ్. 153 లక్షల టన్నులు వడ్లను పండినయ్. ఇది దేశంలోనే రికార్డ్. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఉన్న 23 జిల్లాల్లోకంటే ఇప్పుడు అత్యధికంగా వడ్లు పండించి.. పాలమూరు గడ్డ మీద 'రైతు పండుగ' చేసుకుంటున్నం” అని ఆయన తెలిపారు.
సంక్రాంతిని తలపిస్తున్నది
‘రైతు పండుగ’ను చూస్తుంటే సంక్రాంతిని తలుపిస్తున్నది. మేం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నది. ఈ ఏడాది కాలంలోనే బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమాలు చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది చూసి నవ్వొస్తున్నది. వారి పదేండ్ల పాలనలో రైతులు, వ్యవసాయం గురించి పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ పాలమూరును ఎండబెట్టి ఎడారి చేసిండు. మేం వచ్చాక ప్రతి నెలా రివ్యూ చేస్తున్నం. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని, ప్రతి నెలా బిల్లులు కూడా చెల్లిస్తామని చెప్పి పనులు చేయిస్తున్నాం. మేం రైతులతో వడ్లు తీసుకున్న వారంలోనే పైసలు ఇస్తున్నాం. మీలాగా నెలలుగా నాన్చలేదు. మీరు మామీద ఏడస్తూనే ఉండండి. మేం ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటాం.
- మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
రైతులను రెచ్చగొడుతున్నరు
బీఆర్ఎస్ లీడర్లు రైతులను రెచ్చగొడుతున్నరు. దొంగ డ్రామాలు ఆడుతున్నారు. ఆ పార్టీ పదేండ్లు అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయలేదు. వారి నెత్తిన 30 వేల కోట్ల భారం పెట్టింది. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఈ భారం నుంచి రైతులను విము క్తుల్ని చేసినం. మా అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కోరిక.
- సీతక్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
వరిసాగులో నంబర్ వన్
వరి సాగులో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీతో పాటు, గత ప్రభుత్వం చేయకుండా నిలిపివేసిన రైతు బీమాకు రూ.7 వేల కోట్లు కట్టాం. వడ్లకు మద్దతు ధర చెల్లించడమే కాకుండా, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి వడ్లు కొంటున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలలో మనమే ముందున్నాం.
- తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి
కులగణన సర్వేకు కట్టుబడి ఉన్నాం..
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే, దళిత సమసమాజం కోసం కట్టుబడి ఉంది. అభివృద్ధి, సంక్షేమం సమానంగా అందిస్తూ ముందుకు పోతాం. దేశ చరిత్రలో ఎవరూ చేయని రీతిలో రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే.
- దామోదర రాజనర్సింహ, హెల్త్ మినిష్టర్
ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనుకబడ్డం. పనిలో పడి దాని గురించి ఆలోచన చేయలేదు. మాకు ఆడంబరాలు తెల్వదు. పాలమూరోళ్లకు పని చేయడం తప్ప, గొప్పలు చెప్పుకునేది తెల్వదు. కష్టపడటం తప్ప గొప్పలు చెప్పుకోం. ఇప్పటి నుంచి నేను మాట్లాడను. మీరు (జనం) మాట్లాడాలి. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని నలు దిక్కులా చాటాలి.
- సీఎం రేవంత్ రెడ్డి
నా మీద 182 కేసులు ఉన్నై.
నేను సీఎం అయినా.. నా కేసులే నేను తీసుకోలేకపోయిన. సీఎం వేరు.. చట్టం వేరు. బీఆర్ఎస్ వాళ్ల మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తదో, కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటరో తెలియదు. పరిశ్రమలు పెడ్తే ప్రాంతం అభివృద్ధి చెందుతది. ఉద్యోగాలు వస్తే ఒక తరం బాగుపడ్తది. అందుకే పరిశ్రమలు తెస్తున్న. అంతే తప్ప మీ భూములు గుంజుకొని నేనేం చేస్త. నేను పాలమూరు బిడ్డను. ఇక్కడి మట్టిలో పుట్టిన.. ఇదే మట్టిలో కలుస్త. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిచేయడం నా బాధ్యత.
- సీఎం రేవంత్ రెడ్డి