
జెండా అజెండాలు పక్కన పెట్టి బీసీ బిల్లుకు సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి..బీసీ కోటాపై పార్టీలకతీతంగా ప్రధాని మోదీని కలుద్దామన్నారు.42 శాతం రిజర్వేషన్లు అమలుకు తాను నాయకత్వం వహిస్తానన్నారు రేవంత్. కిషన్ రెడ్డి,బండి సంజయ్, బీజేపీ నేతలు ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించాలన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కోటా ఆమోదం పొందేలా పోరాడుదామన్నారు. మనమంతా కలిసి కట్టుగా ఉన్నామని సంకేతం ఇవ్వాలన్నారు రేవంత్.
ALSO READ | అసెంబ్లీలో బీసీ బిల్లు.. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందాం: మంత్రి పొన్నం
చట్టబద్దత కోసం బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు రేవంత్. తాము చేసిన కులగణన నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పారు. బీసీ జనాభా 56 శాతమని కులగణనలో తేల్చామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు . రాజకీయంగా కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారని చెప్పారు.
రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు రేవంత్. బలహీన వర్గాలకుఅండగా ఉండాలని కామారెడ్డి డిక్లరేషన్ ప్రవేశపెట్టాం. 2024 ఫిబ్రవరి 4న కేబినెట్ లో తీర్మానం చేశాం. 2025 ఫిబ్రవరి 4న కులగణన నివేదిక అసెంబ్లీలో ఆమోదం పొందింది. కాబట్టి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామన్నారు రేవంత్.
కులగణన సర్వేలో ఒకసారి సర్వేలో పాల్గొనని వాళ్లకు రెండోసారి అవకాశం ఇచ్చాం. 3 కోట్ల55లక్ష్లకు మందికి పైగా సర్వేలో సంపూర్ణ వివరాలు ఇచ్చారు. 75 వేల మంది డేటా ఎంట్రీ ఆఫీసర్లు పాల్గొన్నారు. వివాదాలకు తావులేకుండా అందరికీ న్యాయం చేస్తాం. బీసీలకు విద్యా,ఉద్యోగాలు, రాజకీయాల్లో న్యాయమే తమ లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్.