
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం (ఏప్రిల్ 15) శంషాబాద్ నోవాటెల్ హోటల్ వేదికగా జరిగిన సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే.. ఆ తర్వాత నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఎమ్మెల్యేలకు సూచించారు.
మంత్రి వర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని.. కేబినెట్ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవులపై ఒకరికి మించి మరొకరు లీకులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన సీఎం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంత్రి పదవులు రావన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు.
కాగా, మంత్రి వర్గ విస్తరణపై కొందరు ఆశావహులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ధర్మరాజులా ఉండాల్సిన ఆయన ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఏకంగా హుకుం జారీ చేశారు. మరోవైపు.. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలా మంత్రి వర్గ విస్తరణపై ఆశవహులు బహిరంగంగ మాట్లాతుండటంతోనే తాజాగా జరిగిన సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.