
- చెత్త పోస్టులపై చర్యలు.. హద్దులు దాటితే శిక్షలు ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
- జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకోం
- సీఎంగా నన్ను, నా పనితీరును విమర్శిస్తే పడ్త
- ఇంట్లోని ఆడవాళ్లను తిట్టించడమేంటి?
- తీరు మార్చుకోకుంటే తోడ్కలు తీస్త
- చంద్రశేఖర్ రావూ.. మీ పిల్లలకు బుద్ధి చెప్పండి
- ఇది మంచి సంస్కృతి కాదని హితవు
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడతామంటే చూస్తూ ఊకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూట్యూబ్ లో ఏదో ఒక చానెల్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా తిడతామంటే సహించబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరి తప్పుడు ప్రచారాలు శ్రుతి మించుతున్నాయని, దీనికి చెక్ పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామన్నారు. అసలు జర్నలిస్టులు అంటే ఎవరో ఒక డెఫినెషన్ ఉండాలన్నారు. ఎవరు పడితే వాళ్లు జర్నలిస్టులమని ఇష్టారీతిగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇటీవల ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్ పై ఈ మేరకు స్పందించారు.
“పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి రికార్డు చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడతారా? అసలు సోషల్ మీడియాలో పెట్టిన ఆ భాష చూడండి అధ్యక్షా. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు చానెల్స్‌లో వెటకారంగా చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పాటు బ్యాన్ చేసిన్రు. రవిప్రకాశ్, కృష్ణ మాదిగను జైల్లో పెట్టిన్రు. ఇప్పుడు అరెస్ట్ అయిన అమ్మాయి కూడా ఎస్సీలను అవమానించిందని జైలుకు పోయి వచ్చిన అమ్మాయే” అని సీఎం చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక బలహీనపడ్డానని అనుకుంటున్నారేమో. నేను చికాకు పడ్డానని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్ల మీదికి వచ్చి తప్పుడు కూతలు కూసేవాళ్లను బట్టలిప్పదీసి కొడుతారు” అని ఆయన ఫైర్ అయ్యారు.
దిగజారే రాజకీయం చేయను..
బూతులు తిట్టించి, మానసికంగా కుంగదీసి ప్రయోజనం పొందుదామనుకుంటే ఆటలు సాగవంటూ మాజీ సీఎం కేసీఆర్ ను సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘‘చంద్రశేఖర్ రావు గారూ.. మీ పిల్లలకు చెప్పు. ఇది మంచిది కాదు. పదవి ఎంతకాలం ఉంటదని కాదు. ఎట్లా ఉన్నమనేది నేను లెక్క గడుతా. ఆత్మగౌరవం చంపుకుని పదవి కోసం లాలూచి పడి దిగజారే రాజకీయం నేను చేయను. ఉన్నంతకాలం ఉంటా. నిటారుగా ఉంటా. నిఖార్సుగా ఉంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకోను. ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతది. కోర్టుకు పోతే బెయిల్ వస్తది. మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలని మీరు అనుకుంటున్నరేమో. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి వాళ్ల ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేస్తే మంచిదా అధ్యక్షా? ఏం సంప్రదాయం ఇది? తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి భాష వాడలేదు. చంద్రశేఖర్ రావూ.. మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించే ఎవ్వరినీ వదలను” అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
జర్నలిస్టులంటే ఎవరో తేల్చాలి..
ఎవరిని జర్నలిస్టులుగా పరిగణించాలన్న అంశంపై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘మీడియా మిత్రులను, జర్నలిస్టు సంఘాలను కూడా అడుగుతున్నా. ఎవరు జర్నలిస్టులో లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్టు పదానికి డెఫినెషన్ ఇవ్వండి. ఐ అండ్ పీఆర్ ఇచ్చే అక్రెడిటేషన్లు లేదంటే డీఏవీపీ ఆమోదించిన ప్రతికలు, ప్రసార సాధనాలు ఇచ్చే ఐడీ కార్డులు ఉన్నవాళ్లు జర్నలిస్టులా? వాళ్ల గుర్తింపు కార్డు ఏందో తేల్చండి” అని కోరారు. ‘‘ఈ విశృంఖలత్వానికి చెక్ పెట్టాలి. లేదంటే తెలంగాణ సామాజిక వ్యవస్థే దెబ్బతింటుంది. ఒకసారి తమరి మీ నేతృత్వంలో లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్, జర్నలిస్టు సంఘాలు, ఐ అండ్ పీఆర్ మినిస్టర్‌ను పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి చర్చపెడ్దాం. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఎవరిని అన్నా అందరినీ అన్నట్లే. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. దానికి అవసరమైన చట్టం చేయడానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరుతున్న అధ్యక్షా’’ అని సీఎం పేర్కొన్నారు.
ఇదేం విష సంస్కృతి?
ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను బూతులు తిట్టించేవాళ్లు అసలు మనుషులేనా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘‘మీకు భార్య, బిడ్డలు తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, చెల్లెనో, భార్యనో ఈ రకంగా మాట్లాడితే నీవు వింటావా? అని ట్విట్టర్లో పెట్టినోన్ని, అరెస్ట్ ను ఖండిచినోన్ని అడుగుతున్నా. ఏ సంస్కృతిలో ఉన్నారని అడుగుతున్న అధ్యక్షా. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్నది మేము. మమ్మల్ని విమర్శించండి. విశ్లేషించండి. అంతేగానీ మా ఇంట్లోని ఆడబిడ్డల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సమాజం ఇదేనా? ఇక్కడి సంస్కృతిని సర్వనాశనం చేసి విష సంస్కతి తెచ్చిన్రు” అని ఆయన మండిపడ్డారు. ‘‘ఆ తిట్లకు నా పేరు తీసి వాళ్ల పేరు రాసుకోమనండి. అన్నం తిన్నబుద్ధి అవుతుందేమో చూస్తా. ఓపిక పట్టిన అధ్యక్షా. మర్యాదగా ఉంటున్న. వాళ్లకు ఎంతమంది ఉన్నరో తెల్వదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్ల మీదకు వచ్చి బట్టలిప్పదీసి కొడుతరు. చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఊకుంటున్నాం అధ్యక్షా. ఇది చేతకాని తనం కాదు” అని సీఎం స్పష్టం చేశారు.