- పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై ఖర్గే, రాహుల్‌తో భేటీ
- రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసిన సీఎం
న్యూఢిల్లీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. శనివారం రాత్రి ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం బిజీబిజీగా గడిపారు. పార్టీ బలోపేతం, కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ తో కీలక భేటీల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించి భేష్ అనిపించుకున్నారు.
అలాగే, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మన్ సుఖ్ మాండవీయతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీ కల్పించడం తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అందుకు సహకారం ఇవ్వాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి కోరారు.
పెన్ను, గన్నులతో కలిసి సాగిన దాశరథి రంగాచార్య పయనం
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య పయనం పెన్ను, గన్నుతో కలిసి సాగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం దాశరథి జయంతిని పురస్కరించుకుని తుగ్లక్ రోడ్ లోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, నల్గొండ ఎంపీలు బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రోహిణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రంగాచార్య.. తదనంతర కాలంలో నాటి పరిస్థితులను కండ్లకు కట్టినట్టు తన చిల్లర దేవుళ్లు, జీవనయానం వంటి గ్రంథాల ద్వారా అక్షరీకరించారని కొనియాడారు.