సీనియర్ ఐఏఎస్‎ను నియమించండి: SLBC టన్నెల్‌ రెస్య్కూ ఆపరేషన్‎పై CM రేవంత్ రివ్యూ

సీనియర్ ఐఏఎస్‎ను నియమించండి: SLBC టన్నెల్‌ రెస్య్కూ ఆపరేషన్‎పై CM రేవంత్ రివ్యూ

హైదరాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిపై సీఎం రేవంత్ సోమవారం (మార్చి 24) మంత్రులు, ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్‎బీసీ టన్నెల్ వద్ద ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

టన్నెల్ వద్ద సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ | అప్పటి వరకు ఐపీఎస్ అభిషేక్ మహంతి తెలంగాణలోనే

కాగా,  నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర 2025, ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు. 

వెంటనే అప్రమత్తమైన అధికారులు టన్నెల్‎లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్‎లో భారీగా బురద, నీరు ఉబకడంతో పాటు ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలు రెస్య్కూ ఆపరేషన్ ఛాలెంజింగ్‎గా మారాయి. అయినప్పటికీ సహయక బృందాలు తీవ్రంగా కృషి చేసి ఘటన స్థలం వద్దకు చేరుకున్నాయి. టన్నెల్ వద్ద దాదాపు నెల రోజులుగా సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎట్టకేలకు 16వ రోజు ఓ కార్మికుడి డెడ్ బాడీని వెలికితీశాయి. మిగిలిన ఏడుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.