42 శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ,బీఆర్ఎస్​ అడ్డుకుంటున్నయ్: సీఎం రేవంత్​

42 శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ,బీఆర్ఎస్​ అడ్డుకుంటున్నయ్: సీఎం రేవంత్​
  • బీసీల హక్కులు కాలరాసే కుట్ర
  • 42 శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ,బీఆర్ఎస్​ అడ్డుకుంటున్నయ్: సీఎం రేవంత్​
  • మోదీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి.. బీజేపీ నేతలకు అదే భయం పట్టుకున్నది
  • మేం పక్కా లెక్కలు తీసినం..అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నరు
  • ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే.. బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు
  • నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ ​నేతలు నిలువ నీడ లేకుండా చేశారు
  • కొండా లక్ష్మణ్​ చనిపోతే చివరి చూపుకు కూడా కేసీఆర్​ రాలే
  • ఆసిఫాబాద్​ మెడికల్​ కాలేజీకి కొండా లక్ష్మణ్​ పేరు పెడ్తం  
  • కేసీఆర్​ కుట్రలో ఆలె నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్య
  • అఖిల భారత పద్మశాలీ మహాసభలో సీఎం ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: బీసీల హక్కులను కాలరాయడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా ఆదిలోనే అడ్డుకునేలా  కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రదారులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తాము ఇంటింటి సమగ్ర కులగణన సర్వే చేసి.. పక్కా లెక్కలు తీశామని, ఆ లెక్కలను తప్పు అని మొండిగా తొండి వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ తప్పుందో చూపించాలని బీఆర్ఎస్​, బీజేపీ నేతలను అసెంబ్లీలో అడిగితే.. తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు చేసి పంపామని చెప్పారు. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి మోదీ మెడకు చుట్టుకుంటుందనే భయం బీజేపీ నేతలకు పట్టుకున్నదని సీఎం రేవంత్ అన్నారు. బీసీల లెక్కలు తప్పు  అని పక్కన పెడితే.. ఇక శాశ్వతంగా రిజర్వేషన్లు పెరుగవని తెలిపారు. తనకు ఎలాంటి వ్యసనాలు,  అవసరాలు లేవని,  తనకున్నదల్లా.. తనను ఆశీర్వదించిన సమజానికి ఏదైనా చేయాలనే తపన మాత్రమేనని చెప్పారు.  హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఆదివారం నిర్వహించిన అఖిల భారత పద్మశాలీ మహాసభకు సీఎం రేవంత్​ హాజరై, మాట్లాడారు.


చివరగా 1939లో కుల గణన జరిగిందని.. మళ్లీ ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సెస్ జరగలేదని గుర్తు చేశారు. మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ఈ యాత్రలో దేశంలోని బలహీన వర్గాల కష్టాలను చూశారని,  కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ ఆశయమని తెలిపారు. అధికారంలోకి వస్తే బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారని, దానికి పునాది తెలంగాణలో పడిందని అన్నారు.  

కుట్రలను గమనించాలి

ఆనాడు మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్​తోనే నేడు బీసీలకు 27% రిజర్వేషన్లు అందుతున్నాయని సీఎం రేవంత్​ అన్నారు.  అప్పుడు కూడా ఎవరైనా తొండి వాదన చేసి ఉంటే.. రిజర్వేషన్లు వచ్చేవా? అని ప్రశ్నించారు.  ఇప్పుడు తాము ఈ లెక్కను తప్పుపట్టి పక్కనపెడితే.. ఏ రకంగా రిజర్వేషన్లు వస్తాయో ఆలోచన చేయాలని అన్నారు. దీని వెనక ఉన్న కుట్రలను గమనించాలని కోరారు. కేసీఆర్​ సమగ్ర కుటంబ సర్వేలో తేల్చిన బీసీల  లెక్క 51 శాతమని, తాము చేసిన ఇంటింటి కుల గణన సర్వేలో 56.33 శాతంగా తేలిందని, అంటే బీసీ జనాభా 6 శాతం పెరిగిందని చెప్పారు.  కేసీఆర్ ఉన్నత కులాలను 21 శాతం అని లెక్క చూపిస్తే.. తాము చేసిన దాంట్లో 15.28 శాతం అని లెక్క తేలిందని వివరించారు.   ‘‘ఇయ్యాల దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్​గా తీసుకోవాలని రాహుల్​ గాంధీ చెబుతున్నారు. తెలంగాణ మాదిరిగానే కుల గణన చేస్తామని మొన్న బిహార్​లో, నిన్న గుజరాత్​లో చెప్పారు. బలహీనవర్గాల రిజర్వేషన్లు పెంచుతామని, 50 శాతం నిబంధనను తొలగిస్తామని రాహుల్​ గాంధీ చెబుతున్నారు” అని  తెలిపారు.  

బీసీలకు అండగా కాంగ్రెస్​

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1979లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్​ కమిషన్​ను ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్​ తెలిపారు. 1990లో మండల్​ కమిషన్​ నివేదికలో ముస్లిం మైనార్టీలతో కలిపి బీసీలు 52 శాతం ఉన్నారని రికమండ్​ చేస్తే.. 27 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని చెప్పారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్​ పార్టీ అండగా నిలిచిందని తెలిపారు. 2011లో సోనియా గాంధీ నాయకత్వంలో దేశం మొత్తం కుల గణన చేశారని, కానీ ఆ నివేదిక ఇచ్చేలోపు ప్రభుత్వం మారిందని చెప్పారు. ఆ తర్వాత కుల గణన నివేదికను తొక్కి పెట్టారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి, బలహీనవర్గాల  అభ్యున్నతి కోసం తాను పాటుపడతానని చెప్పారు. 

కొండా లక్ష్మణ్​ బాపూజీకి కేసీఆర్​ నివాళి అర్పించలే

పద్మశాలీలు త్యాగంలో ముందుంటారని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇందుకు ఉదాహరణ అని సీఎం రేవంత్​ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తన పదవి త్యాగం చేసి.. ప్రత్యేక రాష్ట్రం కోసం నిలబడ్డాడని గుర్తు చేశారు. ఓ వ్యక్తి (కేసీఆర్​) తెలంగాణ కోసం పార్టీ పెడితే.. ఆయనకు సొంత కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వలేదని, అలాంటిది ఆ పార్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.  నీడనిచ్చిన ఆయనను తెలంగాణ వచ్చాక నిలువనీడ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు కొండా లక్ష్మణ్‌‌కి సరైన గౌరవం ఇవ్వలేదని, చివరకు ఆయన చనిపోతే కూడా కేసీఆర్ చూసేందుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక టెక్స్ టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి.. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి ఆయనను గౌరవించామని తెలిపారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించారు. అలాగే.. ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే, ధృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయనను ఖతం చేశారని విమర్శించారు.  

పాత బకాయిలన్నీ క్లియర్​ చేశారు: ఈరవత్రి అనిల్​

పద్మశాలీలకు ఆత్మగౌరవం ఎక్కువని టీజీఎండీసీ చైర్మన్​ ఈరవత్రి అనిల్ ​అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కాంగ్రెస్​ సర్కార్​ మాఫీ చేసిందన్నారు. చేనేత కార్మికులను ఆదుకున్న నాయకుడు సీఎం రేవంత్​ అని కొనియాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే.. వారికి మనుగడ ఉండదని బీజేపీ, బీఆర్ఎస్ ​భయపడుతున్నాయని, అందుకే రిజర్వేషన్ల పెంపును ఆపే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మురళి, అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. 

పద్మశాలీలకు బీఆర్ఎస్​ ఏం చేసింది?

పద్మశాలీల బతుకమ్మ చీరల బిల్లులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‎లో పెట్టిందని, తాము వచ్చాక పెండింగ్ బకాయిలను క్లియర్ చేశామని సీఎం రేవంత్​ తెలిపారు. పద్మశాలీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పద్మశాలీ బిడ్డ రాపోల్ భాస్కర్‎ను రాజ్యసభకు పంపిన చరిత్ర కాంగ్రెస్‎దని గుర్తుచేశారు. ఈరవత్రి అనిల్​ను కాంగ్రెస్​ ప్రభుత్వం విప్​గా నియమించిదని, ఇప్పుడు తాను ఆయనకు టీజీఎండీసీ కార్పొరేషన్​ చైర్మన్​గా అవకాశం కల్పించానన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు కట్టుకోలేదని, అవి పొలాల దగ్గర దిష్టిబొమ్మలుగా పనికొచ్చాయని విమర్శించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. అయితే.. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించామని, అందుకే మహిళ సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రూ. 600 కోట్ల విలువైన కోటి 30 లక్షల చీరల ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని చెప్పారు. రూ. కోటితో షోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని తెలిపారు. అన్ని రకాలుగా పద్మశాలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్.. నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన మగ్గం నేశారు.