తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్​ది కీలకపాత్ర: సీఎం రేవంత్

తెలంగాణ ఉద్యమంలో  అలయ్ బలయ్​ది కీలకపాత్ర: సీఎం రేవంత్
  • పొలిటికల్​ జేఏసీ ఏర్పాటుకు స్ఫూర్తి ఇదే: సీఎం రేవంత్
  • దత్తాత్రేయ ఏటా రాజకీయాలకతీతంగా నిర్వహిస్తున్నరు
  • తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతున్నరు
  • అందుకే తమ పార్టీ తరఫున పాల్గొన్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ‘అలయ్​ బలయ్’​ది కీలకపాత్ర అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. పొలిటికల్​ జేఏసీ ఏర్పాటుకు ఈ  కార్యక్రమమే స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్​లోని​ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో  హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ‘అలయ్ ​బలయ్’​ కార్యక్రమానికి సీఎం రేవంత్​ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల సందర్భంగా 19 ఏండ్లుగా రాజకీయాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ‘అలయ్​ బలయ్’​ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేయడమే  ‘అలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలవారీగా కార్యక్రమాలు జరిగేవని అన్నారు.  ‘అలయ్​ బలయ్’​ కార్యక్రమ స్ఫూర్తితో జెండాలకు ఎజెండాలకు అతీతంగా పొలిటికల్ జేఏసీ ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో దీని స్ఫూర్తితోనే అన్నివర్గాల ప్రజలు కార్యోన్ముఖులై ముందడుగు వేశారని చెప్పారు. 

దసరా పెద్ద పండుగ

తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ అని సీఎం రేవంత్​ అన్నారు. దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వచ్చినట్టే.. ‘అలయ్​ బలయ్’​ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారని చెప్పారు.  ఆయన నుంచి వారసత్వంగా తీసుకొని విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా దీన్ని నిర్వహిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు.  అందుకే తమ పార్టీ తరఫున అందరం ఇందులో పాల్గొన్నామన్నారు. కాగా, సీఎం మాట్లాడే సమయంలో దత్తాత్రేయ కల్పించుకొని చేతి వృత్తుల వారికి అవసరమైన నైపుణ్యం అందించాలని, దానికి తాను సహకరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని గొంగడి, కర్రతో దత్తాత్రేయ, విజయలక్ష్మి సన్మానించారు.