- గత సర్కారు హయాంలో రోడ్లకు, లే అవుట్లకూ పెట్టుబడి సాయం: సీఎం రేవంత్
- అనర్హులకు రూ.22వేల కోట్ల అయాచిత లబ్ధి
- బీఆర్ఎస్ హయాంలోతొలి మూడేండ్లలో3 వేల మంది రైతుల సూసైడ్
- తాము ఏడాదిలోనే25.35 లక్షల మందికి రుణమాఫీ చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకం అమల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సాగులో లేని భూములు, గుట్టలు, చెట్లు, లే అవుట్లు, నేషనల్ హైవే రోడ్లకూ రైతు బంధు ఇచ్చారని పేర్కొన్నారు. చాలామంది అనర్హులకు అయాచిత లబ్ధి చేకూర్చారని విమర్శించారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా? అని సభ్యులను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కూడా రైతు భరోసాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, ఈ స్కీమ్ అమలులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పెట్టుబడి సాయంపై నిర్ణయాల్లో ప్రధాన ప్రతిపక్షం సలహాలు తీసుకొని విధి విధానాలను ముందుకు తీసుకెళ్లాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
భూమినే నమ్ముకుని, భూమిని అమ్మగా భావించిన రైతులను ఆదుకోవాలనేదే తమ ఆలోచన అని వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రైతు బంధు ఉద్దేశం పెట్టుబడి సాయం అని, మరి పెట్టుబడి సాయం ఎవరికి ఉండాలి? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.72,817 కోట్లను రైతు బంధు రూపంలో ఖర్చు చేశారని, దీంట్లో రూ.22,606 కోట్లు సాగులో లేని భూములకు ఇచ్చారని చెప్పారు. గతంలో గజ్వేల్ సెగ్మెంట్ లోని రాజీవ్ రహదారికి, ఆమన్ గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు పెట్టుబడి సాయం ఇచ్చారని అన్నారు. క్రషర్ యూనిట్లు నడిచే ప్రాంతాలకు, మైనింగ్ భూములకు, పోడు భూములకు నకిలీ పట్టాలు తీసుకొన్న వారు రైతు బంధు పొందినట్టు చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో 70 నుంచి 80 శాతం వ్యవసాయం చేయడం లేదని, కానీ గతంలో 3 కోట్ల ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుంటూ పోయారని వివరించారు. రైతు బంధు రూపంలో వేలాది కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. చివరి పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో
రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం..
బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి మూడేండ్లలోనే 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం రేవంత్ చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తాను 2019లో పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీలో 2014లో 160, 2015లో 516, 2016లో 239 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 2014లో 2,568, 2015లో 3,030, 2016లో 2,550 మంది అన్నదాతలు సూసైడ్ చేసుకున్నారని వివరించారు. అయితే, బీఆర్ఎస్ ఏలుబడిలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని తెలిపారు.
తెలంగాణలో 2014లో 898, 2015లో 1,358, 2016లో 632 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని ఆత్మహత్యలు జరగలేదని పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా జనాభా ఉన్న యూపీలో 2014లో 63, 2015లో 145 మంది, 2016లో 69 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. జనాభాలో ఎక్కడో ఉన్న మనం.. ఆత్మహత్యల్లో మాత్రం రెండోస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాళ్లు తలదించుకుని రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్నేతలను విమర్శించారు. అబద్ధాల సంఘం అధ్యక్షుడు (కేసీఆర్) సభకు రాలేదని, ఉపాధ్యక్షుడు (కేటీఆర్) వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు వాస్తవాలు తెలుసు కాబట్టే వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టారని చురకలంటించారు.
ఏడాదిలో 25 లక్షల మందికి రుణమాఫీ చేసినం
ఏడాదిలో ఏం చేశారని చాలాసార్లు తమను బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, కానీ, పదేండ్లలో వాళ్ల హయాంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ ఐదేండ్ల దాకా రూ.లక్ష రుణమాఫీకి ఖర్చు చేసింది రూ.16,143 కోట్లు మాత్రమే. అది కేవలం మిత్తికే సరిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక వాళ్లు చేసిన రుణమాఫీ రూ.11,909 కోట్లు మాత్రమే. దీంట్లోనూ 8,515 కోట్లు మిత్తికే పోయింది. ఈ లెక్కన బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కేవలం రూ.3,384 కోట్లు మాత్రమే. మొత్తంగా పదేండ్లలో వారు (బీఆర్ఎస్) చేసిన రుణమాఫీ రూ.27వేల కోట్లు మాత్రమే” అని వెల్లడించారు.
తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 27 రోజుల్లో 25,35,963 మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి, అన్నదాతల రుణం తీర్చుకున్నదని సీఎం చెప్పారు. ఇది తమ గొప్పతనంగా అనుకోవడం లేదని, ఇది తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. 2018 డిసెంబర్11 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేండ్ల మధ్యలో రైతుల లోన్లు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. అధికారంలోకి రాగానే ముందుగా రైతు రుణమాఫీ చేశామని, తాము కూడా ఐదేండ్ల దాకా వేచి చూసి ఉంటే ఇచ్చిందంతా మిత్తీలకే పోయేదన్నారు. టెక్నికల్ సమస్యలతో ఎక్కడైనా రుణమాఫీ కాకపోతే తప్పకుండా చేస్తామని రైతులకు హామీ ఇచ్చామని, అధికారులకూ ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. అప్పట్లో కేసీఆర్ మాత్రం రైతులకు ఇచ్చేందుకు రూ.8వేల కోట్లు కూడా ప్రభుత్వం దగ్గర లేవని చెప్పారని, కానీ ఇప్పుడు రైతుల కోసమే బతుకుతున్నట్టు వాళ్లు (బీఆర్ఎస్) మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తున్నరు
సభలో బీఆర్ఎస్సభ్యుల చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ వాళ్లు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని అందరికీ పెట్టుబడి సాయం ఇవ్వాలంటున్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకోమంటున్నారు. అలా చేస్తే మేం ఇక్కడ ఉండం. అక్కడ ఉంటం. మాకు రైతులు ఆదర్శం. రైతు సంక్షేమమే మాకు ముఖ్యం. సభలోకి వస్తే సమాజం ముందు తల దించుకోవాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్) సభకు రాలేదేమో? రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ లే అవుట్లకు, నేషనల్ హైవేలకు రైతు భరోసా ఇద్దామా? ప్రతిపక్షంగా ఒక స్పష్టమైన సూచన ఇవ్వండి. సభ్యులు కూడా విధానం చెప్పాలి. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం వేశాం. జిల్లాల్లోనూ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. సభలోనూ చర్చలు చేస్తున్నాం. అందరి సలహాలు, సూచనలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మాకు ఎలాంటి భేషజాలు లేవు. బీఆర్ఎస్ వాళ్లు రెచ్చగొట్టినా అందుకే మేం సంయమనంగా ఉంటున్నం. వారి చిల్లర, చిత్ర విచిత్ర వేషాలను ప్రజలు చూస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.