- ఆ పార్టీ గుర్తించని గద్దర్‌ను వారికి గుర్తుండేలా చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- ఆయనకు పద్మశ్రీ నిరాకరించికేంద్రం తప్పు చేసిందని ఫైర్
- నెక్లెస్ రోడ్ లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని ప్రకటన
- ఉగాదికి గద్దర్ అవార్డులు అందజేస్తం: డిప్యూటీ సీఎం భట్టి
బషీర్ బాగ్, వెలుగు: గద్దర్ కు పద్మశ్రీ నిరాకరించి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గద్దర్ ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ గుర్తించలేదని ఫైర్ అయ్యారు. దీనిపై ప్రశ్నించినందుకు తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గద్దర్ ను విమర్శిస్తే బీజేపీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న ఏరియా మా పరిధిలోనే ఉంది. అవసరమైతే ఆ ప్రాంతానికి గద్దర్ పేరు పెడ్తం. ఆ పార్టీ గుర్తించని గద్దర్ ను వారికి గుర్తుండేలా చేస్తం” అని చెప్పారు. గతంలో గద్దర్ ను గేట్ల బయట కూర్చోబెట్టిన పార్టీ గతి ఏమైందో తెలుసుకోవాలని, ఆయనను తక్కువ చేసి మాట్లాడితే బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని గుర్తించనోళ్లు గద్దర్ ను ఎలా గుర్తిస్తారని బీజేపీపై విమర్శలు చేశారు. ‘‘ఎవరెన్ని చేసినా మహనీయుల కీర్తి తగ్గదు. గద్దర్ గౌరవం పెంచేలా మేం పని చేస్తాం. నెక్లెస్ రోడ్డులో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు.
గద్దర్ ఎందులో తక్కువా?
గద్దర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారిని జాగృతం చేశారని రేవంత్ కొనియాడారు. ‘‘గద్దరన్నతో నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసం ఆయనతో మాట్లాడేవాడిని. గద్దర్ నేర్పిన పోరాట స్ఫూర్తితోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రాష్ట్ర సాధనలో గద్దర్ పాత్ర కీలకమైంది. అలాంటి మహనీయుడికి గుర్తింపు ఇవ్వాలని ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం. గద్దర్ మరణించినప్పుడు ఆ విషయం తెలంగాణ సమాజానికి తెలియకుండా చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఎల్బీ స్టేడియానికి నేను ముందుండి తీసుకెళ్లాను” అని చెప్పారు. ‘‘గద్దర్ తో పాటు చుక్క రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమల్ రావు, గోరటి వెంకన్నకు పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. వాళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లు కాకపోయినా తెలంగాణ సాధనలో వారి పాత్ర గొప్పది. వాళ్లను గుర్తించాలని కేంద్రాన్ని కోరితే విస్మరించింది. కానీ ఏపీ ప్రతిపాదించిన ఐదుగురికీ పద్మ అవార్డులు ఇచ్చింది.’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
గద్దర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం వ్యాప్తి: భట్టి
ఉగాదికి గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ‘‘రాష్ట్రం తమతోనే వచ్చిందని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకుల కంటే.. గద్దర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం వ్యాప్తి చెందింది. అలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ ముందు ఆ పార్టీ గంటల తరబడి కూర్చోబెట్టింది. గౌరవం ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం ఆయనను ఆకాశమంత ఎత్తులో నిలబెడుతున్నది” అని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.