
- ప్రతి సెగ్మెంట్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
- గాంధీ నడిపిన ‘యంగ్ ఇండియా’ పత్రికే స్ఫూర్తి
- పెత్తనం చెలాయించేందుకు ప్రజలు అధికారం ఇవ్వలే
- వాళ్ల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం
- పోలీసు స్కూల్స్ కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేద్దాం
- హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి ఆఫీసర్ల పిల్లలకు అడ్మిషన్లు
- పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో బ్రాండ్.. తెల్ల అన్నం అనంగనే అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తరు. ఆయన ఇచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం యాదికొస్తది. ఐటీ కంపెనీలను చూడంగానే చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు.. అదే విధంగా జలయజ్ఞం అనంగానే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు. కొందరు తాము ఉద్యమకారులం అని, అది తమ బ్రాండ్ అని చెప్పుకుంటరు.. ఆ జోలికి నేను వెల్ల దల్చుకోలేదు.. నా బ్రాండ్ ఏమిటి అంటే యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్.!
= సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రతి ముఖ్యమంత్రి ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారని, మీ బ్రాండ్ ఏమిటని అడుగుతున్నారని, దానికి సమాధానం యంగ్ ఇండియానే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహాత్మా గాంధీ 1920 నుంచి 1931 వరకు యంగ్ ఇండియా పత్రికను నడిపి ఆంగ్లేయులను పారదోలారని, ఆయన స్ఫూర్తిగానే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు.
గురువారం (ఏప్రిల్ 10) ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ దేశం సమస్యను భవిష్యత్ తరాల అవసరాలను గుర్తించి బిజీలీ, పానీ సడక్ కీలకమని భావించారని చెప్పారు. అందులో భాగంగానే ప్రతి ఊరికి కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు బాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి జలాశయాలు కట్టించారని అన్నారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టారని చెప్పారు. దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను నెలకొల్పింది ఆయనేనని అన్నారు. తనకు పోలీసు శాఖతో అనుబంధం ఉందని సీఎం చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ లో హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి పిల్లల వరకు అడ్మిషన్ల ఉంటాయని అన్నారు.
ప్రపంచ పటంలో సౌత్ కొరియా చిన్నదేశమని ఆ కంట్రీకి ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో 32 బంగారు పతకాలు వచ్చాయని అన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒక్కటీ రాలేదని అన్నారు. తాను కొరియా వెళ్లినప్పడు ఓ విద్యార్థిని తనతో మాట్లాడిందని, ఒలింపిక్స్ లో మూడు బంగారు పతకాలు సాధించినట్టు చెప్పిందని అన్నారు. మనం ఎందుకు ఆస్థాయికి వెళ్లొద్దనే పట్టుదలతోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు.
స్కిల్ వర్సిటీ విద్యార్థులకు 100% జాబ్స్
తెలంగాణలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నా వాళ్లలో నైపుణ్యం ఉండటం లేదని చెప్పారు. అందుకే స్కిల్ వర్సిటీని ప్రారంభించు కున్నామని చెప్పారు. ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్లు పూర్తయ్యాయని, అందులో అందరికీ జాబ్ గ్యారెంటీ అని అన్నారు. వాళ్లను ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయని వివరించారు. ఆ వర్సిటీనిన మహేంద్ర సంస్థతో పీపీపీ పద్ధతిలో నడుపుతున్నామని చెప్పారు. అందులో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యామిలీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు డైరెక్టర్లుగా ఉన్నారని అన్నారు.
స్పోర్ట్స్ వర్సిటీలో కూడా తమకు అవకాశం కల్పించాలని పెద్ద కంపెనీల యజమానులు ముందుకు వచ్చారని, పోటీ పడే వారిని షార్ట్ లిస్ట్ చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని, 25 ఎకరాల్లో నిర్మించబోతున్నామని, ఇందుకు బడ్జెట్ కేటాయింపులు సైతం చేశామని సీఎం వివరించారు. తన మొదటి ప్రాధాన్యం చదువేనని సీఎం పునరుద్ఘాటించారు.