కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్

  • ఏపీలో వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
  • 2029లో షర్మిల సీఎం అవుతారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కడప ఎంపీ బైపోల్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయని, అదే జరిగితే ఆ బైపోల్ బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీ టచ్​చేసే సందర్భం వస్తే కడపలోనే ఉంటానని.. గల్లీగల్లీ తిరిగి ప్రచారం చేస్తానని చెప్పారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని అంటరని, ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతామని, మీరంతా కలిసి రావాలని ఆయన కోరారు. సోమవారం మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​తో కలిసి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వైఎస్ వెల్ఫేర్ స్కీమ్​ల సృష్టి కర్త అని, మన కుటుంబంలో ఒకరని చెప్పారు. “ఏపీలో వైఎస్ షర్మిల ఎంతో పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. ఇక్కడ అంతా పాలక పక్షమే.. అంతా బీజేపీ పక్షమే. ఏపీలో ఇప్పుడు ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమే. 2029లో లో ఏపీ సీఎంగా షర్మిలను చూస్తం. వైఎస్​ఆశయాలను కొనసాగించే వాళ్లే నిజమైన వారసులు. ఆయన పేరుతో వ్యాపారం చేసే వాళ్ల వారసులు కాదు. ఏపీలో కాంగ్రెస్ బలపడేందుకు అండగా నిలబడతం” అని అన్నారు.

అలాంటి నేత కనపడరు: షర్మిల

వైఎస్​ఆర్ అంటే ముఖం నిండా చిరునవ్వు, రాజ సం అని షర్మిల అన్నారు. రెండో సారి గెలిచాక మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాలి అనుకున్నాడని, అలా వెళ్తూ చనిపోయారన్నారు. ఆయన లాంటి వ్యక్తి ఇప్పటి సమాజంలో కనపడరని తెలిపారు. “ఇయ్యాల వైఎస్ వారసుడినని చెప్పుకొనే వారు బీజేపీతో అంటకాగుతున్నారు. తెరవెనుక పొత్తులు పెట్టుకొని ఆయన ఆశయాలను తుంగలో తొక్కారు” అని ఆమె అన్నారు.వైఎస్ఆర్ ఇతర సీఎంల కంటే ఎంతో భిన్నం: భట్టి

ఎంతో మంది సీఎంలు వస్తుంటారు, పోతుంటారు కానీ వారందరిలో వైఎస్ భిన్నమైన వారని డిప్యూటీ సీఎం భట్టి  అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫ్రీ కరెంట్, ఫీజు రీయింబర్స్​మెంట్, ఇందిరమ్మ ఇండ్లు ఇలా ప్రతి స్కీమ్ దేశం అంతా గుర్తించుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ ఆశయాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో షర్మిల ఆధ్వర్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్టీని, పాలనలను రెండు కళ్లలా చూసిన వ్యక్తి వైఎస్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వైఎస్ పేరుతో హైదరాబాద్ లో స్మృతి వనం నిర్మించాలని కొండా సురేఖ సీఎంను రేవంత్​ను కోరారు. పాలన అంటే వైఎస్ అని.. ఆయన మహానాయకుడని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.