
తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్ అవార్డును పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన సీఎం.. తెలంగాణలో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తామని అన్నారు. తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పెద వాడికి ఆరోగ్యం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాద్ లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తామని.. అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనికి డా.నాగేశ్వర్ రెడ్డి సహకారం కావాలని కోరుతున్నామని అన్నారు.
ALSO READ : ఇంటర్ పరీక్షలపై సీఎస్ కీలక సూచన.. జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు..
డా.నాగేశ్వర్ రెడ్డి వైద్య వృత్తిని ఒక బాధ్యత గా తీసుకున్నారని, అందుకే ఆయన ఇంత సాధించగలిగారని అన్నారు. డాక్టర్ అనే వారు రోగులతో కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండాలని, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.