- ఇదే నినాదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్లాన్లో రేవంత్
- రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాను సన్మానించేందుకు నిర్ణయం
- ఆమెను ఆహ్వానించేందుకుఢిల్లీ వెళ్లిన సీఎం
- ఖర్గే, రాహుల్, ప్రియాంకలకూ ఇన్విటేషన్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఇచ్చింది సోనియా...తెచ్చింది కాంగ్రెస్ ” అనే నినాదంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. తమ వల్లే తెలంగాణ వచ్చిందంటే.. కాదు తమ వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ చేసుకుంటున్న ప్రచారానికి చెక్ పెట్టాలంటే ఈ స్లోగన్ ను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 2 న పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగానే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఆ రోజున రాష్ట్రానికి ఆహ్వానించి, ఘనంగా సన్మానించేందుకు సిద్ధమైంది. సోమవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఆయన సోనియాగాంధీని కలిసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి రావాలని ఆహ్వానించే అవకాశం ఉంది. అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంకను కూడా ఇన్వైట్ చేయనున్నారు.
సోనియాను సన్మానిస్తే తప్పేంటి?
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో యువత బలిదానాలుచూసి చలించిపోయిన సోనియా.. ఎలాంటి రాజకీయ స్వార్థం ఆలోచించకుండా వెంటనే రాష్ట్రం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చినందున ఆమెను ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు కొందరు సోనియాను ఆహ్వానించి, సన్మానం చేయడాన్ని తప్పుపట్టడంపై పలువురు పీసీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాను ఘనంగా సన్మానించడం ద్వారా ‘‘ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా...తెచ్చింది కాంగ్రెస్’’ అనే నినాదం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లనుందని ఆ పార్టీ భావిస్తున్నది. అయితే, ఈ ప్రోగ్రామ్ కు సోనియా రావడంపై క్లారిటీ రావాల్సి ఉంది. వయస్సు రీత్యా, ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని సోనియా ఇక్కడకు రావడంపై పీసీసీ నేతలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.