
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న భూ భారతి పోర్టల్ ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్,మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ఉత్తమ్,పొంగులేటి, పొన్నం,జూపల్లి ,మేయర్ గద్వాల విజయలక్ష్మీ పలువురు నేతలు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.
566 రైతువేదికలలో భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. భూ భారతి అమలుకు పైలట్ ప్రాజెక్ట్ గా నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇన్నాళ్లు ధరణి పోర్టల్‌లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు.. ఇకపై భూభారతి పోర్టల్‌లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్నిరోజుల పాటు ఆటంకం ఏర్పడగా, ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో, ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి అప్టు డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు ఉండవు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకుముందు ఉన్న 33 మాడ్యుల్స్‌ను ఆరుకు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్‌పోర్టల్‌ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు.
దశలవారీగా చట్టం అమలు..
భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్‌లైన్స్ రెడీ చేసి, ఏప్రిల్ 14 నుంచి దశలవారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టంలో మొత్తం 23 అంశాలు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ప్రతిదీ వెబ్ పోర్టల్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడించి, ఒక్కోదాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. ఇప్పుడైతే రాష్ట్రవ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇకపై అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి.
అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? అనేది తెలుసుకునేందుకు మూడు మండలాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో వంద శాతం భూసమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నది. ఇంతకుముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు.