- తన నివాసంలో మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ
తాడ్వాయి, వెలుగు: ఫిబ్రవరి 23న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. శనివారం వనదేవతల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. మేడారం మహా జాతరకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహా జాతరకు హాజరై అమ్మవార్లను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కాగా, ఫిబ్రవరి 23న శుక్రవారం మేడారం వనదేవతల దర్శనానికి వస్తానని సీఎం పూజారులకు తెలిపారు. అనంతరం జాతర పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతరలో పూజారుల సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇతర కార్యక్రమాల గురించి పూజారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, సారలమ్మ పూజారి కాక సారయ్య, కిరణ్, ప్రధాన కార్యదర్శి చందా గోపాలరావు, సమ్మక్క పూజారి చందా రఘుపతిరావు, కాకా వెంకటేశ్వర్లు, కాకా భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.