
- ఉత్సాహంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- చిన్ననాటి స్నేహితులతో మాటామంతీ
- వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్/పెద్దమందడి, వెలుగు: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం వనపర్తికి మొదటిసారి వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. టీనేజ్‌లో సీఎం చాలా ఏండ్ల పాటు ఇక్కడే ఉండడం.. ఇంటర్ విద్య కూడా ఇక్కడే సాగడం.. వనపర్తిలోనే ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేసి ఇక్కడే కొన్నేండ్ల పాటు ఉండడంతో.. అత్యంత సన్నిహితులైన వారు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మధ్యాహ్నం 2 గంటలకు వారితో చిట్‌చాట్ చేశారు. ఆయన చదువుకున్న వనపర్తిలోని హెచ్‌సీఎం స్కూల్ ఫ్రెండ్స్‌తో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వనపర్తిలో ఆయన అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పలకరించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం వద్ద సీఎంను పలువురు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. కొందరు సీఎం పెయింటింగ్‌ను బహూకరించారు. మరికొందరు కండువాలతో సత్కరించారు. సీఎంతో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. రేవంత్ స్నేహితురాలు ఒకరు కాలేజీ డేస్‌లో తోటి ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫొటో ఆల్బమ్‌ను బహూకరించారు. దాన్ని సీఎం అక్కడే ఓపెన్ చేసి ఆ ఫొటోలను అందరికీ చూపించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
సీఎం ముందుగా స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డిని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఫొటోను బహూకరించి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు.
వనపర్తి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్) కొత్త బిల్డింగ్ నిర్మాణానికి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వనపర్తి బాయ్స్ జడ్పీహెచ్ఎస్ కొత్త బిల్డింగ్, ఐటీ టవర్స్ బిల్డింగ్ నిర్మాణానికి, శ్రీరంగాపురం టెంపుల్ అభివృద్ధి పనులకు, పెబ్బేరులో 30 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణానికి, రాజనగరం నుంచి పెద్దమందడికి బీటీ రోడ్డు నిర్మాణానికి, వనపర్తి నియోజకవర్గంలో ఎస్టీ హ్యాబిటేషన్ వర్క్స్ కోసం, సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. భోజనం అనంతరం కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం 10,490 మందికి కుట్టు మిషన్లు అందజేశారు. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.300 కోట్ల నిధులను అందజేశారు. ఒంటరి మహిళలు, నిస్సహాయ తల్లులకు రూ.50 వేల చొప్పున నిధులు కేటాయించారు. అలాగే ఫకీర్సాబ్లకు రూ.లక్షతో మోపెడ్లను అందజేశారు. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా’ ఆధ్వర్యంలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.వెయ్యి కోట్ల చెక్కును అందజేశారు. డీసీసీబీ చైర్మన్ మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ఎడ్ల బండి మెమెంటోతో సీఎంను సత్కరించారు. డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు ట్రాక్టర్ యూనిట్లను అందించారు. ముస్లిం సోదరులు సీఎంకు దట్టీని కట్టారు.
నిధులు మంజూరు పట్ల హర్షం
వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరానని, ఆయన స్పందించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం హర్షణీయమన్నారు. ఖాసింనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సర్వే పనులకు శంకుస్థాపన చేయడంతో పంట పొలాలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. సీఎం సభకు నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చి సక్సెస్ చేయడం, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు,