హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం (జనవరి 10) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తుందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వం పనితీరుకు కొలమానమని, సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్లే ప్రజల్లోకి తీసుకెళాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలని అధికారులకు సూచించారు.
Also Read :- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలో ఆదేశాలిచ్చామని.. అయినప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా ఆఫీసులకే పరిమితమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. జనవరి 26 తర్వాత స్వయంగా తానే ఆకస్మిక తనిఖీలు చేస్తానని.. నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.