హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లకు త్వరలోనే కొత్త టీచర్లు రానున్నారు. 10,006 మంది ఎంపికైన టీచర్ అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే వారికి స్కూళ్లలో పోస్టింగ్ లూ ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. దసరా సెలవులు పూర్తయి స్కూళ్లు తెరుచుకునే నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ–2024 నిర్వహించింది. మంగళవారం 1: 1 రేషియోలో జిల్లాలు, పోస్టులు, మీడియం వారిగా సెలెక్షన్ లిస్టులనూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు.
ఎంపికైన వారందరికీ ఆయా జిల్లాల డీఈఓలు మేసేజ్లు, మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. వారికి బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం నియమక పత్రాలు అందించనున్నారు. అయితే, ఎంపికైన వారందరినీ హైదరాబాద్ సభకు తీసుకొచ్చే బాధ్యతను డీఈఓలకు అప్పగించారు. దీంతో వారే అక్కడి నుంచి ప్రత్యేకంగా బస్సుల ద్వారా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. సీఎం కొంతమందికి నేరుగా అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనుండగా, మిగిలిన వారికి జిల్లాల వారికి మొత్తం 60 ప్రత్యేక స్టాల్స్ పెట్టి అందించనున్నారు. అయితే, 1,056 పోస్టులను కోర్టు కేసుల నేపథ్యంలో రిక్రూట్ చేయడం లేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయిన వాటిలో పలు జిల్లాల్లోని స్పెషల్ టీచర్లు, పీఈటీలున్నారు. మరోపక్క పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని తెలుస్తున్నది.