- వెంకటస్వామి ప్రజల ఆస్తి.. పేద కుటంబాల దైవం
- పీవీ తర్వాత అంతటి ఖ్యాతి ఆయనకే దక్కింది
- 80 వేల మందికి నిలువ నీడనిచ్చిన మహనీయుడు
- సింగరేణి కార్మికుల ఇంట్లో దీపమైన మహానేత
- కాకా జయంతి వేడుకల్లో సీఎంరేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాకా ఆలోచనలకు మనమంతా వారసులమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రవీంద్రభారతిలో జరిగిన కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం మాట్లాడారు. నిలువ నీడలేని 80 వేల మందికి ఇండ్లు కట్టించిన మహనీయుడు కాకా అని కొనియాడారు. జాతీయ స్థాయిలో నెహ్రూను చాచా అంటారని, తెలుగు రాష్ట్రాలకు కాకా వెంకటస్వామి అని అన్నారు. కాకా ప్రజల ఆస్తి అని, పేద కుటుంబాల దైవమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీవీ నరసింహారావు తర్వాత జాతీయ స్థాయిలో అంతటి ఖ్యాతి సాధించిన వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు వెంకటస్వామితో అనుబంధం ఉందని గుర్తు చేశారు. తాను హైదరాబాద్ వచ్చినప్పుడు చిక్కడ పల్లిలోని వెంకటస్వామి ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించేవాడినని గుర్తు చేశారని చెప్పారు. వివేక్ ను పార్టీకిలోకి ఆహ్వానించాలని చెబితే తాను ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్టు చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ లో ఉన్న కుటుంబాలకు కాకా స్ఫూర్తితో మాట ఇస్తున్నానని, వారిని అనాథలను చేయబోమని అన్నారు. వాళ్ల సంక్షేమం బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి వెంకటస్వామి అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాకా వారుసులు ముగ్గురితోపాటు తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. ఎన్ ఎస్ యూఐలో ఉన్న తాను రాజకీయంగా ఎదగడానికి మార్గదర్శి కాకా వెంకటస్వామేనని అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తాత గురించి మాట్లాడాలంటే ఎమోషన్ లో మాటలే రావు. పార్లమెంటులో మాట్లాడుతుంటే.. అందరూ కాకాను గుర్తు చేశారు. పార్లమెంటులో పేదల కోసం మాట్లాడిన వ్యక్తి అని అన్నారని చెప్పారు. ఈ సందర్బంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే పంపిన సందేశాన్ని గడ్డం వంశీకృష్ణ చదివి వినిపించారు. పెద్దపల్లిలో కాకా విగ్రహం ఏర్పాటు చేయాలని సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి అన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటులో కాకా కీలక భూమిక పోషించారని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. దేశంలో రేషన్ పంపిణీ విధానానికి ఆద్యుడు వెంకటస్వామి అన్నారు. ఆయన ఈ శాఖ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రేషన్ స్టార్టయిందని అన్నారు. రాష్ట్రంలో ఆయన సివిల్ సప్లయిస్ మంత్రిగా ఉన్నప్పుడు అన్నపూర్ణ క్యాంటిన్లు ప్రారంభించారని, ప్రభుత్వం రూపాయికే ఇడ్లీ అందించదని గుర్తు చేశారు.
అతిథులకు కాకా జీవిత చరిత్ర బుక్స్
దివంగత నేత కాకా వెంకటస్వామి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను పెద్దపల్లి ఎంపీ, కాకా మనుమడు గడ్డం వంశీకృష్ణ అతిథులకు అందించారు.